సీఎం తీరుపై మండిపాటు

30 Oct, 2013 04:30 IST|Sakshi
సాక్షి, చిత్తూరు: రెండున్నర సంవత్సరాలుగా సీఎం కుర్చీలో ఉన్న పీలే రు శాసనసభ్యుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో పార్టీ నాయకులకు, కిందిస్థాయి శ్రేణులకు నియోజకవర్గాల స్థాయిలో నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేవలం పార్టీ పదవులు కట్టబెట్టడానికి మాత్రమే పరిమితమయ్యా రు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతల్లో అసహనం మొదలయింది. తిరుపతి నియోజకవర్గంలో తుడ చైర్మన్ పదవిపై ఇద్దరు ఆశతో ఉన్నా ఆ దిశగా సీఎం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. శ్రీకాళహస్తిలో ఆలయ చైర్మన్ పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నా వారి ఆశ నిరాశగానే మిగిలింది. జిల్లాలోని కాణిపాకం దేవస్థానానికి కూడా పాల కమండలిని, చైర్మన్‌ను నియమించలేదు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు కూడా చేపట్టలేదు.
 
  పీలేరు నియోజకవర్గంలో కొన్ని, పలమనేరు, చంద్రగిరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో మినహా ఇంకెక్కడా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు చేపట్టలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాలోని పలు దేవాలయాలకు పాలకమండళ్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు ఆరు నెలల కిందట మంత్రి సీ.రామచంద్రయ్య సూచనల మేరకు పాలకమండళ్ల నియామకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు కూడా అలాగే ఉన్నాయి. తిరుపతి గంగమ్మగుడి దేవస్థానం పాలకమండలి నియామకం కూడా గ్రూప్ తగాదాలతో పెండింగ్‌లో ఉంచారు.
 
 పార్టీ పదవులతో బుజ్జగింపు
 సీఎం సొంత జిల్లాలో కేవలం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అమాసకు డీసీసీబీ చైర్మన్ కట్టబెట్టడం మినహా కొత్తగా ఇంకెవరికీ పదవులు ఇవ్వలేదు. పార్టీ పరంగా ఊరూరికీ పీసీసీ పదవులు ఇస్తూ అందరినీ సంతృప్తిపరచాలని చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు పదిమందికి పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పదవులు కట్టబెట్టారు. గతంలో ఎంఆర్‌సీరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి పీసీసీ ఆఫీస్ బేరర్స్‌గా ఉండగా వీరికి పీసీసీ కార్యదర్శి పదవులు ఇచ్చారు.
 
  శ్రీకాళహస్తి నాయకులు కోలా ఆనంద్‌కు, తిరుపతి మాజీ కౌన్సిలర్ టీకే బ్రహ్మానందంకు, ఐకేపీ మహిళా సంఘాల నాయకురాలు శ్రీదేవికి , మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌కు, పీఆర్పీ మాజీ నాయకులు ఊకా విజయకుమార్‌కు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కుమారుడు హరికృష్ణకు పీసీసీ కార్యదర్శి పదవులు కట్టబెట్టారు. ఇలా నియోజకవర్గానికి ఒక పీసీసీ కార్యదర్శి లెక్కన రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు ఇచ్చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఏదైనా ప్రభుత్వ నామినేటెడ్ పదవి వస్తుందనుకున్న వారికి ఇలా పార్టీ పదవులతో సరిపెట్టడంతో వారు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సీఎం తనకు కావాల్సిన వారికి పదవులు ఇచ్చుకోవడం, నిజంగా పార్టీకోసం కష్టపడిన వారిని విస్మరించడం మినహా ఈ రెండున్నర సంవత్సరాల్లో చేసిందేమి లేదని, అడిగితే ముఖాన పార్టీ పదవులు విధిలిస్తున్నారని, ఇవి తమకెందుకని కొందరు జిల్లా స్థాయి నాయకులు మండిపడుతున్నారు. 
 
 నియోజకవర్గాల్లో కింది క్యాడర్‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బుజ్జగించినా పార్టీలో కొనసాగే పరిస్థితి కనపడడం లేదు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశ లేకపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
మరిన్ని వార్తలు