లోకేశా.. ఇది లోకల్‌ ప్రేమేనా?

12 Jun, 2018 09:18 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఔత్సాహికులు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వంటి విదేశీ సంస్థలకే విలువైన భూములు ఇస్తోందన్న విమర్శలపై ఐటీ శాఖా మంత్రి  నారా లోకేష్‌ చేసిన ప్రకటనలు, ట్విట్టర్‌ వేదికగా ఇస్తున్న సమాధానాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఐటీ రంగంలో విశాఖలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించే వారికి ఎర్ర తివాచీ వేస్తామని, ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త శ్రీనుబాబు.. పల్సస్‌ కంపెనీ పెట్టేందుకు వస్తే ప్రభుత్వం భూములు కేటాయించిందని లోకేష్‌ ఆర్భాటంగా ప్రకటించారు.

వాస్తవానికి పల్సస్‌ కంపెనీకి ఇప్పటికీ గజం భూమి కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా పొందిన పల్సస్‌ సంస్థ ఐటీ రంగంలో మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తామని దరఖాస్తు చేసి రెండేళ్లయినా ఇంకా పరిశీలనలోనే ఉంది. ఐదు నుంచి పది ఎకరాల్లోపు కేటాయించగలమని, ఎకరం ధర రూ.3 కోట్ల మేర ఉంటుందని సదరు పల్సస్‌ సంస్థకు సర్కారు చెబుతూ వస్తోంది. అయితే ఇప్పటికీ కేటాయింపుపై స్పష్టత లేకపోగా, నారా లోకేష్‌ మాత్రం పల్సస్‌ సంస్థకు కేటాయించేశామని చెప్పడం గమనార్హం. ఇదే విషయం ఇప్పుడు ఐటీరంగంలో చర్చనీయాంశమైంది.


ప్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు అడ్డగోలు కేటాయింపులు
ప్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు భూముల కేటాయింపులపై విమర్శలకు సమాధానంగానే లోకేష్‌ పల్సస్‌ ప్రస్తావన తెచ్చి.. మరిన్ని విమర్శలకు తావిచ్చారు. రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టే టెంపుల్టన్‌  రెండువేల ఉద్యోగాలు కల్పిస్తుందని లోకేష్‌ చెప్పారు. అందుకే 40 ఎకరాల భూములు కట్టబెట్టామని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి టెంపుల్టన్‌ 25 ఎకరాలే కోరితే.. అత్యంత ఉదారంగా 40ఎకరాలు కేటాయించడంపై ఇప్పటికీ వివాదం చెలరేగుతోంది. తొలుత మల్టీనేషనల్‌ కంపెనీ టెంపుల్టన్, దేశీయ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్‌కు కలిపి 40 ఎకరాలు కేటాయిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు సంస్థలు సంయుక్తంగా భూమిని అడగడంపై వివాదంతో పాటు.. ఇన్నోవా సొల్యూషన్స్‌ సంస్థ బాధ్యుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని బయటకు రావడంతో సర్కారు వెనక్కి తగ్గి జీవోలో మార్పులు చేసింది. ఇన్నోవా సొల్యూషన్స్‌ను తప్పించి మొత్తం 40ఎకరాలూ టెంపుల్టన్‌కే కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఎకరానికి 40 రూ.లక్షలు చొప్పున రిషికొండలోని ఐటీ హిల్స్‌లో భూమి కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ కేటాయింపుల్లోనూ అక్రమాలు దాగున్నాయి.

40 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నా..రెండున్నరవేల ఉద్యోగాలేనా?
ఐటీ నిబంధనల ప్రకారం.. భూములు తీసుకున్న కంపెనీలు ఎకరానికి 500మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఆ మేరకు టెంపుల్టన్‌ 40ఎకరాలకు గానూ 20వేల మందికి ఉద్యోగాలివ్వాలి. కానీ లోకేష్‌ మాత్రం టెంపుల్టన్‌ కంపెనీ 2500 ఉద్యోగాలిస్తుందని గొప్పగా చెప్పారు. 20వేలమందికి ఇవ్వాల్సిన కంపెనీ 2,500మందికి ఇస్తామంటే సదరు మంత్రి ఘనంగా ప్రకటించడం విమర్శలపాలవుతోంది. మరోవైపు 3వేల ఉద్యోగాలు కచ్చితంగా కల్పిస్తామని చెబుతున్న శ్రీకాకుళం యువ పారిశ్రామికవేత్తకు చెందిన పల్సస్‌ కంపెనీకి ఐదు నుంచి పది ఎకరాల్లోపే ఇస్తామని చెబుతున్నా.. ఇంకా సాగదీస్తుండటం గమనార్హం.

ఇక విదేశీ సంస్థ అయిన టెంపుల్టన్‌కు రిషికొండ ఐటీ హిల్స్‌లో ప్రైమ్‌ లొకేషన్‌లో ఎకరం రూ.40 లక్షలకు  కట్టబెట్టిన సర్కారు.. పల్సస్‌కు మాత్రం ఎకరం రూ. 3కోట్ల ధర చెబుతోంది. ఇప్పుడు ఇదే విషయం ఐటీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇప్పటివరకు స్థానికులకు ఒక్కరికి కూడా భూములు కేటాయించకపోవడం కూడా చర్చకు తెరలేపింది.  విశాఖ నగరానికే చెందిన 12మంది ఐటీ ప్రతినిధులు భూముల కోసం దరఖాస్తు చేసుకోగా, టీడీపీ సర్కారు కొలువుదీరిన నాలుగేళ్లలో ఒక్క దరఖాస్తుకు కూడా మోక్షం కలగలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే లోకేష్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రకటనలు చేయడం నవ్వులపాలవుతోంది. 

మరిన్ని వార్తలు