‘స్థానిక’ పాలనకు సన్నాహాలు

23 Jun, 2014 02:41 IST|Sakshi

సాక్షి, అనంతపురం:  ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అనుకూలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దీంతో స్థానిక సంస్థల్లో రెండేళ్లుగా కొనసాగనున్న ప్రత్యేకాధికారులకు తెర పడనుంది.
 
 పురపాలికల్లో!
 జిల్లాలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, మడకశిర, కళ్యాణదుర్గం, పామిడి, పుట్టపర్తి పురపాలక సంఘాల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరితగతిన కౌన్సిల్ ఏర్పడితే కేంద్ర నిధులు, స్థానిక బడ్జెట్  నిధులతో తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీరంతా ఇప్పటికే ప్రణాళికలు రూపొం దించుకున్నారు.  
 
 ఇప్పటికే ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే లు, ఎంపీలు ఆయా మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లో సభ్యత్వం పొందారు. ఇక హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మలక్రిష్టప్ప హిందూపురం మునిసిపాలిటీలో సభ్యతానికి సిద్ధంగా ఉండగా, అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి మునిసిపాలిటీలో ఎక్స్‌అఫిషియో సభ్యునిగా సభ్యత్వా న్ని పొందనున్నారు. సాధారణంగా చైర్మన్ ఎంపిక క్లిష్టతరం అయినప్పుడు ఎక్స్‌అఫిషియో ఓటు కీలకమవుతుంది. ప్రస్తుతం  గుత్తి మునిసిపాలిటీలో మినహా మిగి లిన పురపాలికల్లో ఈ ఓట్లకు పెద్దగా ప్రాధాన్యం లేదు.
 
 మార్గదర్శకాలు ఇలా
 రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు గెజిటెడ్ హోదాగల అధికారిని ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హాజరుకావాలని నోటీసులు జారీ చేస్తారు.
 
 మొత్తం సభ్యుల్లో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేనిపక్షంలో ఎన్నిక వాయిదా పడుతుంది. తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల్లో ఎవర్ని బలపరచాలనే  అంశంపై విప్ జారీ చేస్తాయి. విప్‌లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. తరువాత ఎన్నిక ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతిలో జరుగుతుంది.
 
 ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఏ సభ్యుడైనా, సభ్యురాలైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటును చెల్లుబాటవుతుంది. తరువాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా..ఇవ్వకపోయినా సభ్యుని పదవి రద్దు విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సభ్యుడు పదవి కోల్పోయే అవకాశం ఉంది.
 
 పరిషత్తులకూ..!
 పురపాలక పాలకమండళ్ల ప్రమాణ స్వీకార ప్రక్రియ ముగిసిన తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 63 మండలాల్లో 42 జెడ్పీటీసీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి అధికార పగ్టాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించించింది. మండల పరిషత్ అధ్యక్ష పీఠాలూ ఎక్కువగానే టీడీపీ ఖాతాలో చేరనున్నాయి.
 

మరిన్ని వార్తలు