సర్టిఫికెట్లతో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ

14 Aug, 2014 01:55 IST|Sakshi
సర్టిఫికెట్లతో ఉద్యోగుల స్థానికత నిర్ధారణ
  • కమలనాథన్ కమిటీ నిర్ణయం
  •   ఉద్యోగుల సర్వీస్ రికార్డులతో పాటే పరిశీలన
  •   ఆప్షన్లు దుర్వినియోగం కాకుండా గట్టి చర్యలు
  •  సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో స్థానికతను నిర్ధారించడానికి సర్వీసు రికార్డులతోపాటు, ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఆప్షన్ల విధానం దుర్వినియోగం కాకుండా చూసేందుకు అవసరమైన ఇతర చర్యలకూ సిద్ధమైంది. విభజన తేదీకి ముందు ఉద్యోగులు లేదా వారి కుటుంబసభ్యుల్లో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న, అంగవైకల్యం ఉన్నట్లు నమోదైన వారినే పరిగణనలోకి తీసుకోవాలని, దీర్ఘకాలిక వ్యాధులపై మెడికల్ బోర్డుతో పరిశీలన చేయించాలని కూడా కమిటీ అభిప్రాయపడుతోంది. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీ బుధవారం
     తెలంగాణ సచివాలయంలో సమావేశమైంది. 
     
    ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున అర్చనావర్మ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో పాటు తెలంగాణ ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రామకృష్ణారావు, ఏపీ అధికారులు ఎల్వీ సుబ్రమణ్యం, డాక్టర్ పీవీ రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల స్థానికతను సర్వీసు రికార్డుల ఆధారంగా తనిఖీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వాదించారు. మరోవైపు ఉద్యోగుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించాలని తెలంగాణ సీఎస్ సూచించారు. దీంతో ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి ఈ కమిటీ గత నెల 25న జారీ చేసిన మార్గదర్శకాలపై వంద వరకు అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ఎక్కువగా 18(ఎఫ్) నిబంధనపై అభ్యంతరాలు వచ్చాయి. 
     
    ఒక కేడర్‌లో స్థానికత ఆధారంగా సీనియర్లందరినీ భర్తీ చేశాక.. మిగిలిన వాటిని స్థానికతతో సంబంధం లేకుండా ఏ రాష్ర్టంలోని జూనియర్లతోనైనా భర్తీ చేయొచ్చని 18(ఎఫ్) నిబంధనలో ఉంది. దీనిపైనే ఎక్కువగా అభ్యంతరాలు రావడంతో స్వల్ప మార్పులు చేయడానికి కమిటీ నిర్ణయించింది. తప్పనిసరి ఆప్షన్స్ ఉన్న ఉద్యోగుల్లో భార్యాభర్తలు, ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తదితర అంశాలను దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఇక ఉద్యోగుల విభజన సెల్‌లో తెలంగాణ అధికారులకు భాగస్వామ్యం కల్పించనున్నారు. ఆంధ్రా సచివాలయానికి సంబంధించి మొత్తం సమాచారం సీజీజీ విభాగం నుంచి రానున్న నేపథ్యంలో.. దానికి డీజీగా ఉన్న తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా విభజన ప్రక్రియలో భాగస్వామిని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, చివరి గ్రేడ్ ఉద్యోగులైన అటెండర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు తదితరులను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. 
     
    ఈ ఉద్యోగులు ఆప్షన్స్ ఇస్తే ఆ ప్రకారమే విభజిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం కేడర్ పోస్టులను ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. తుదకు ఖరారు చేసిన మార్గదర్శకాలు కేంద్ర హోం, న్యాయ శాఖల ద్వారా ప్రధాని ఆమోదం కోసం వెళతాయి. అక్కడ ఆమోదముద్ర పడగానే ఇరు రాష్ట్రాలకు కేడర్ పోస్టులను కేటాయిస్తారు. వీటి ఆధారంగా తుది మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరుగుతుంది. భౌగోళికంగా కచ్చితంగా ఉండాల్సిన పోస్టులను ఆయా రాష్ట్రాలకే కేటాయించనున్నారు. ఉదాహరణకు పోర్టులు, ఈఎస్‌ఐ సంస్థలు ఉన్న చోట మొత్తం ఉద్యోగులను ఆయా రాష్ట్రాలకే కేటాయిస్తారు. ఇక్కడ 58:42 నిష్పత్తిని పాటించరు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ తాత్కాలికంగా పూర్తయ్యాక ఏ ప్రభుత్వం ఎన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించడానికి అంగీకరిస్తుందో తెలుస్తుందని, దాని ఆధారంగా శాశ్వత విభజన చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు ఎలాంటి ప్రతిపాదనలు చేయనట్లు సమాచారం.
మరిన్ని వార్తలు