ఎన్నికల్లో పోటీకి స్థానికులకే అవకాశం 

13 Feb, 2020 04:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా నివాసం ఉంటున్నవారికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులో లేకుండా వేరే చోట నివాసం ఉంటున్నారని, దీనివల్ల స్థానికంగా ఏ సమస్య వచ్చినా ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి తలెత్తుతోందన్నారు. అందుకే ప్రజాప్రతినిధులు స్థానికంగానే నివాసం ఉండాలన్న నిబంధనను తీసుకొచ్చినట్లు తెలిపారు.   

ప్రలోభాలు రుజువైతే జైలుకే.. 
వచ్చే ఎన్నికల్లో ప్రలోభాలు రుజువైతే, ఆ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఆ పదవుల్లో కొనసాగేందుకు అనర్హులు అవుతారని, ఆ మేరకు చట్టంలో సవరణలు చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయడం వంటి నేరాలకు పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10 వేల వరకు జరిమానా విధించేలా నిబంధనలు తీసుకువచ్చామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ కాలపరిమితిని తగ్గిస్తూ తీర్మానం చేశామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 18 రోజుల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో నిర్వహిస్తామన్నారు.

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధి 24 రోజులు ఉంటే దానిని తగ్గించామన్నారు. ఎన్నికల ప్రచార కాలపరిమితిని 5 నుంచి 7 రోజులకు పరిమితం చేశామన్నారు. గిరిజన జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ పదవిని, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని జెడ్పీటీసీ స్థానాలను గిరిజనులకే రిజర్వు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు. 

>
మరిన్ని వార్తలు