ఆధార్‌కు లాక్‌ వేద్దాం!  

15 Jun, 2019 10:51 IST|Sakshi

సాక్షి,గుంటూరు : ప్రతి పనికి ఆధార్‌ తప్పనిసరి.. ప్రభుత్వ పథకాలైనా.. ప్రైవేటు పనులైనా ఆ కార్డు లేకుంటే పని జరగదు. ఈ క్రమంలో అదే స్థాయిలో సమాచార చోరీ, వ్యక్తిగత వివరాల భద్రతకు అవరోధంగా మారింది. సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్న తరుణంలో డిజిటల్‌ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చోరీలు జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో గోప్యతకు రక్షణ కల్పిస్తూ చోరీకి చెక్‌ పెట్టేందుకు కేంద్రం ‘ఎం–ఆధార్‌ యాప్‌’ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఎం ఆధార్‌’ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌తో ఆధార్‌ కార్డులోని డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని తెలిపింది. ఎవరైనా సరే తమ ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌(వేలిముద్రను) వినియోగించి అవసరమైనప్పుడు కార్డులోని డేటా సేవలను పొందే వీలు కల్పించింది. వినియోగదారుడు ప్రమేయం లేకుండా ఆధార్‌ వినియోగాన్ని నిలిపివేయడమే దీని ప్రధాన ఉద్దేశం. సెల్‌ఫోన్‌ ఎప్పుడు వినియోగదారుడి వెంటనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.

అన్నింటా ఆధారే..
రేషన్‌ దుకాణం మొదలు బ్యాంకు ఖాతా, ఫోన్‌ సిమ్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్ట్, నగదు బదిలీ, దుకాణం లైసెన్స్‌ ఇలా ఏది కావాలన్నా ఆధార్‌ వివరాలు తప్పనిసరి. ఆయా సందర్భాల్లో సమర్పించే నకళ్ల ద్వారా ఆధార్‌ సమాచారం గోప్యత ప్రశ్నార్థకం అవుతోందనే అనుమానాలు ఉన్నాయి. అయితే సమాచార చోరీకి అడ్డుకట్ట వేసేందుకు ‘ఎం ఆధార్‌ యాప్‌’ ఉపయోగపడనుంది. స్మార్ట్‌ ఫోనణ్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని బయోమెట్రిక్‌ రూటర్‌ ద్వారా మనమే వివరాలను ఆన్‌లైన్‌లో అందించి ఎలాంటి సేవలైనా పొందవచ్చు. ఏదైనా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకునే సమయంలో ఫోన్‌ యాప్‌లో ఎం ఆధార్‌ను ఎటాచ్‌ చేసుకుంటే జిరాక్స్‌ కాపీలతో పని ఉండదు. ఈ యాప్‌ ద్వారా ఏదైనా దరఖాస్తును నేరుగా చేసుకునే అవకాశం ఉంటుంది. నూతన విధానం అందుబాటులోకి రావడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే వారికి మరింత సులువైంది.

డౌన్‌లోడ్‌ విధానం ఇలా...
ఆధార్‌ అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌తో ఎం ఆధార్‌ యూప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ సంఖ్య నమోదు చేసి యాక్టివేట్‌ చేసుకోవాలి. తర్వాత కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌) వివరాలను నమోదు చేస్తే జనరల్‌ క్యూ ఆర్‌ కోడ్‌ వస్తుంది. దీని ద్వారా బమోమెట్రిక్‌ నమోదువుతుంది. యాప్‌లో బయోమెట్రిక్‌ లాక్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత అవసరమైనప్పుడు లాక్‌ ఓపెన్‌ చేసి ఆధార్‌ వివరాలతో ఆన్‌లైన్‌లో ఎలాంటి జిరాక్స్‌ పత్రాలు ఇవ్వకుండానే లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం ఉంది. మిగిలిన సమయాల్లో బయోమెట్రిక్‌ను లాక్‌ చేయవచ్చు. దీని ద్వారా సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి ఆధార్‌ వివరాలను కాపాడుకోవచ్చు. బయోమెట్రిక్‌ లాక్‌ చేయడం వల్ల ఆధార్‌ యాక్సెస్‌ ఉన్న పలు బహుళజాతి కంపెనీలు, సైబర్‌ నేరగాళ్లకు ఆధార్‌ డేటా కనిపించదు.

మరిన్ని వార్తలు