లాక్‌డౌన్‌: పెరిగిన గాలి నాణ్యత 

9 Apr, 2020 09:11 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

లాక్‌డౌన్‌తో అదుపులో  వాయు కాలుష్యం

పరిశ్రమల మూత, తగ్గిన వాహనాల రాకపోకలు

వాహనాల రాకపోకల నియంత్రణ ఫలితం

పరిశ్రమలు, వాహనాల కాలుష్యంతో పల్లెల నుంచి పట్టణాల వరకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణం. ప్రాణాంతకంగా పరిణవిుంచిన కాలుష్యానికి కరోనా నుంచి ఉపశమనం లభించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడ్డాయి. వాహనాల్లో 80 శాతం నడవని పరిస్థితి. దీంతో నెల్లూరు నగర పరిధిలో వాయు కాలుష్యం సగానికి సగం తగ్గినట్లు కాలుష్య నియంత్రణ శాఖ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. స్వేచ్ఛమైన వాయువులతో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగు కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

సాక్షి,  నెల్లూరు: స్వచ్ఛమైన గాలితో నెల్లూరు ఊపిరి పీల్చుకుంటోంది. నెల్లూరుకు చుట్టు పక్కల రైస్‌మిల్లులు, థర్మల్‌ ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర కాలుష్యకారక పరిశ్రమలు, లక్షల సంఖ్యలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యేవారు. గత నెల 22వ తేదీ నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితి మారింది. పరిశ్రమలన్నీ మూతపడడం, చాలా పరిమిత సంఖ్యలో తిరిగే వాహనాల కారణంగా కాలుష్యం అదుపులోకి వచ్చింది. ఫలితంగా నగర వాసులకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో వాహనాలు వినియోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. వాహనాలు ఎక్కువయ్యే కొద్దీ వాటి నుంచి ఉద్గారాలు అధిక పరిమాణంలో విడుదల అవుతాయి. దీని వల్ల దుమ్ము ధూళి, రసాయన అవశేషాలు ఊపిరి తిత్తుల్లోకి వెళ్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమయ్యేది.

నెల్లూరు నగరంలో ఇలా..
నెల్లూరు జనాభా 2004లో చూస్తే 4,04,775 మంది ఉండగా 2009 ఏడాదికి 5,58,547 లక్షల మందికి చేరుకున్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతూనే వస్తోంది. నాలుగేళ్ల వ్యవధిలోనే రవాణా వాహనాల సంఖ్య దాదాపు లక్షకు పైగా చేరుకొంది. అందులో ద్విచక్ర వాహనాలు 92,941 వరకు సంఖ్య చేరుకుంది. కార్లు వినియోగం 15,987 వరకు చేరుకున్నాయి  ఇక ఆటోల సంఖ్య 25,413 వరకు చేరుకున్నాయి. దీంతో నగర జనాభాలో సగం వాహనాలు అయ్యాయి. కొన్నేళ్లలో జనాభా సంఖ్యను దాటనుందని ఇటీవల జరిపిన పలు సర్వేల్లో తేలింది.

పెరిగిన కాలుష్యం
పెరుగుతున్న వాహన వినియోగంతో గాలిలో దూళి కణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధాన కూడళ్లలో 10 మైక్రో గ్రాములు ఉండాల్సిన సూక్ష్మ ధూళి కణాలు 60,  2.5 మైక్రో గ్రాముల్లో ఉండాల్సిన అతి సూక్ష్మ ధూళి కణాలు 40 చేరింది. గాలిలో సన్నటి ధూళిని ఈ ప్రమాణం సూచిస్తుంది. వాహనాల రద్దీ ఎక్కువయ్యే కొద్దీ ఈ గణాంకాలు పరిమితిని దాటి నమోదవుతున్నాయి.  నగర పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి కూడా కాలుష్యం వెలువడుతోంది. గత నెల 22 నుంచి అంతటా లాక్‌డౌన్‌ అమలవుతోంది. సడలించిన సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో జనసంచారంపై నిషేధం ఉంది. పరిశ్రమలు కూడా మూత పడ్డాయి. దీంతో కాలుష్యం బాగా తగ్గింది.

పరిమితి దాటితే చేటు 
పాత వాహనాల నుంచి విడుదల అయ్యే పొగలో నల్లటి ధూళి కణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయని బయటకు వస్తే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు కంటికి కనిపించనంతగా ఉంటాయి. మనిషి వెంట్రుక కన్నా సూక్ష్మంగా ఉంటాయి. లాక్‌డౌన్‌ వల్ల వాహనాల రాకపోకలు ఆగాయి. దీని వల్ల రోడ్ల పక్కన ఉండే దుమ్ము, ధూళి లేచి గాలిలో కలవడం లేదు.

మరిన్ని వార్తలు