చిన్న పరిశ్రమలకు ఊపిరి

2 May, 2020 13:24 IST|Sakshi
చీమకుర్తి సమీపంలోని గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్‌

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాయితీల విడుదలకు సర్కార్‌ నిర్ణయం  

జిల్లాలో నాలుగు వేల పరిశ్రమలకు పైగా ప్రయోజనం  

రూ.150 నుంచి రూ.200 కోట్ల మేర లబ్ధి

హర్షం వ్యక్తం చేస్తున్న చిన్న పరిశ్రమల యజమానులు

ఒంగోలు టూటౌన్‌: సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఊపిరి పోస్తూ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మూడేళ్ల పాటు ఇవ్వకుండా బకాయి పెట్టిన రాయితీలను మనుగడ కష్టమైన ప్రస్తుత తరుణంలో ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడంపై అటు పరిశ్రమల యజమానులు, ఇటు పరిశ్రమల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల జిల్లాలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు లబ్ధిచేకూరనుంది. రాయితీలు రాక నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమల యజమానులకు ప్రభుత్వ నిర్ణయంతో ఊపిరి లేచొచ్చింది. రెండు నెలలుగా పరిశ్రమల మనుగడపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. చిన్న, గ్రామీణ పరిశ్రమలకు కేంద్రం కొన్నింటికి ఇటీవల సడలింపునిచ్చినా రీస్టార్ట్‌ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. యజమానులతోపాటు ఉద్యోగులు, కార్మికులు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు గడవటం కష్టంగా మారాయి. యజమానులు బ్యాంకుల రుణాలు చెల్లించలేని దుస్థితిలోకి నెట్టబడ్డారు. 

రోజూ జిల్లాలో రూ.500 కోట్లకుపైగా నష్టం..
లాక్‌డౌన్‌ వల్ల రోజుకి జిల్లాలో దాదాపు రూ.500 కోట్లకు పైగా పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో 42 క్వారీలు, 4 వేల వరకు పాలిషింగ్‌ యూనిట్లలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఇవిగాక ఇంకా 6,470 వరకు చిన్న పరిశ్రమలు, గ్రామీణ ఖాదీ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, సిమెంట్‌ బ్రిక్స్‌ తయారీ యూనిట్లు, వివిధ రకాల విస్తరాకుల తయారీ వంటి యూనిట్లు ఉన్నాయి. చీమకుర్తి, కనిగిరి, మార్కాపురం, మార్టూరు మండలాల చుట్టు పక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇంకొన్ని ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి పైగా కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మరో 16,235 మంది మాత్రమే తాత్కాలిక ఉపాధి పొందుతున్నారు. చిన్న పరిశ్రమలతో పాటు మరో 67 భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కరోనా నివారణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు, కర్షకులు, కూలీలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది. దీని వలన కుటుంబాలు ఆర్ధికంగా కోలుకోలేకుండా పోతుండటంతో ఇటీవల కొన్ని పరిశ్రమలను రీస్టార్ట్‌ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. గ్రీన్‌జోన్‌ పరిధిలో ఉన్న పరిశ్రమలకే అనుమతి ఇస్తూ మార్గదర్శకాలను విడుదల చేశారు. చిన్న పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను తెరుచుకునే వెసులుబాటు కలిగించింది. 

నియోజకవర్గాల వారీగా కమిటీలు:  పరిశ్రమ రీస్టార్ట్‌కు యజమాని దరఖాస్తు చేసుకుంటే దానిపై మూడు కమిటీలు పరిశీలించాల్సి ఉంది. జీవో ఎంఎస్‌ నంబర్‌ 88  ప్రకారం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా కమిటీలను కలెక్టర్‌ ఇటీవల వేశారు. నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌తో పాటు లేబర్‌ అసిస్టెంట్‌ కమిషనర్, ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ పరిశ్రమల రీస్టార్ట్‌కు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. అనంతరం జిల్లా స్థాయి స్క్రీనింగ్‌ కమిటీ వెళ్లి పరిశ్రమను పరిశీలన చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం సక్రమంగా ఉంటేనే అనుమతి ఇస్తారు. ఒక వేళ పనిలో ఉన్న కార్మికులకు కరోనా సోకితే దానికి పరిశ్రమ యజమాని బాధ్యుడు అవుతాడని ఆంక్షలు ఉండటంతో ఎవరూ పరిశ్రమ రీస్టార్ట్‌కు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఫలితంగా వేల కోట్లు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మూడు నెలలు మారిటోరియం ఇచ్చినా ఏ మాత్రం ప్రయోజనం లేదని చిన్న పరిశ్రమల యజమానులు పలువురు నిరాశ వ్యక్తం చేశారు.  

కష్టకాలంలో ఆసరాగా..
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాయితీలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడి కోలుకోలేని స్థితిలో ఉన్న పరిశ్రమలకు రూ.905 కోట్లు రాయితీలు విడుదల చేయాలని నిర్ణయించడం అటు పరిశ్రమల యజమానుల్లో భరోసా నింపింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా రాయితీల బకాయిలు విడుదల చేసి చిన్న పరిశ్రమల మనుగడను కాపాడాలని నిర్ణయించడంపై ఫాప్సియా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.సుబ్బారావు, ఫాప్సి కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు