లాక్‌డౌన్‌: ఆక్వాకు ఆక్సిజన్‌

9 Apr, 2020 08:30 IST|Sakshi
కరప మండలం పాతర్లగడ్డలో కోస్టల్‌ ఆక్వా రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌లో ఎగుమతి దారుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, వర్మలతో  మాట్లాడుతున్న మంత్రి కురసాల కన్నబాబు   

లాక్‌డౌన్‌తో సంక్షోభంలో ఉన్న పరిశ్రమను 

పనిచేసే చోటే కూలీలకు భోజన ఏర్పాట్లు 

ప్రొసెసింగ్‌ యూనిట్లలో స్తంభించిన కార్యకలాపాల పునరుద్ధరణ 

మంత్రి కురసాల కన్నబాబు చొరవతో  ఉత్పత్తి ప్రారంభం  

సాక్షి, కాకినాడ: ఆక్వా పరిశ్రమ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ‘కోవిడ్‌–19’ వైరస్‌ దెబ్బకు సంక్షోభంలో కూరుకుపోయిన ఈ రంగాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. లాక్‌డౌన్‌ కారణంగా పది రోజులుగా స్తంభించిన రొయ్యల ప్రాసెసింగ్‌ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనుమతులు మంజూరు చేసింది. కూలీల సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళుతోంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రాసెసింగ్‌ యూనిట్ల యాజమాన్యాలతో చర్చించారు. ప్రస్తుతం కూలీలకు ఇస్తున్న కూలి కంటే 50 శాతం అదనంగా అందించాలని సూచించారు. అందుకు ఆయా యూనిట్ల యాజమాన్యాలు అంగీకరించాయి. పనులు చేస్తున్న చోటే కూలీలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చూపిన చొరవతో ఐదు రోజులుగా ఆక్వా ఉత్పత్తులు ప్రారంభం అయ్యాయి. వాటిని ప్రాసెసింగ్‌ యూనిట్ల యాజమాన్యాలు  కొనుగోలు చేసి భద్రపరుస్తున్నాయి. ప్రొసెసింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎగుమతులు ప్రారంభిస్తారు.

ఏం జరిగిందంటే.. 
కరోనా ప్రకంపనలు జిల్లాలోని ఆక్వా ఉత్పత్తులకు తాకడంతో నెలన్నర రోజులుగా పరిశ్రమ సంక్షోభంలో ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పది రోజులుగా మరింత దారుణంగా మారింది. డిసెంబర్‌లో వచ్చే పంటతో లాభాలు ఆర్జించవచ్చని గంపెడాశలు పెట్టుకున్న సాగుదారులకు ఈ సంక్షోభం కన్నీళ్లు మిగిల్చింది. ధరల పతనానికి తోడు.. ప్రాసెసింగ్‌ యూనిట్లు మూత పడడంతో చెరువుల్లోని రొయ్యల పట్టుబడి చేయలేని స్థితి నెలకొంది. దీనికితోడు దళారులు దీన్ని బూచిగా చూపిస్తూ మరింత ప్రతిష్టంభన సృష్టించారు. దీంతో ఆక్వా రంగం ఆటుపోట్ల మధ్య కొట్టుమిట్టాడింది. 

జిల్లాలో ఇలా.. 
జిల్లాలో 55 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. దాదాపు 25 వేల మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు నడుస్తున్నాయి. ప్రాసెసింగ్‌ కంపెనీల నుంచి కంటైనర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. భారతదేశం నుంచి యూఎస్‌ఏ, ఈయూ, చైనా, జపాన్‌ వంటి దేశాలకు లక్షల మెట్రిక్‌ టన్నుల్లో సరుకు ఎగుమతి అవుతోంది. ఇందులో అత్యధికంగా యూఎస్‌ఏకు 41 శాతం ఉండగా.. తర్వాత చైనా దేశానికి 23 శాతం మేర సరుకు రవాణా అవుతోంది. తర్వాత జపాన్‌ 16, ఈయూకు 10 శాతం ఎగుమతి అవుతోంది. జిల్లా నుంచి ఏటా 1.20 లక్షల నుంచి రూ.1.35 మెట్రిక్‌ టన్నుల వరకూ సరుకు విదేశాలకు ఎగుమతి అవుతోంది. రూ.3,900 కోట్ల వ్యాపారం సాగుతోంది. నెల రోజులుగా ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో లక్షల మెట్రిక్‌ టన్నుల సరుకు గోదాములకే పరిమితమైంది. స్థానికంగా గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిల్లాడుతుంటే.. ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులకు ఆశించిన ధర చెల్లించలేని పరిస్థితిలో ఎగుమతిదారులు ఉన్నారు. ఎకరాకు రూ.7 లక్షలకు పైనే పెట్టుబడి పెట్టిన రైతులు లబోదిబోమంటున్నారు.  

మంత్రి కన్నబాబు చొరవతో..  
ఆక్వా రైతుల దీనావస్థను స్వయంగా పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సరుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. సీఎం రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణం స్పందించారు. ఆక్వా ప్రొసెసింగ్‌ యూనిట్లు రైతులు పండించిన ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగా మంత్రి కన్నబాబు కాకినాడ రూరల్‌ కరప మండలంలో ఉన్న రొయ్యల ప్రొసెసింగ్‌ యూనిట్లను సందర్శించారు. యూనిట్లు తెరచి పనులు చేపట్టాలని సూచించారు. కూలీల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఆక్వా కేంద్రం వద్ద ఒక నోడల్‌ అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు. పనులు చేసే ప్రాంతంలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని, భౌతిక దూరం పాటించాలని, కారి్మకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు.

మరిన్ని వార్తలు