కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

27 Mar, 2020 05:39 IST|Sakshi
తిరుపతిలో నిర్మానుష్యంగా మారిన బస్టాండ్‌ సమీప ప్రాంతం 

ఇళ్లకే పరిమితమైన ప్రజలు

నిత్యావసరాల కొనుగోలులో వెసులుబాటుతో కాస్త ఊరట

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు జరుగుతోంది. జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే నిత్యావసరాల కొనుగోలు సమయంలో ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. కావాల్సిన వస్తువులు నిర్ణీత సమయానికి కొనుగోలు చేసి ఇళ్లకు చేరారు. 
►వైఎస్సార్‌ జిల్లాలో లాక్‌ డౌన్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాలకు అనుమతులివ్వడంతో ఆ సమయంలోనే ప్రజలు కావాల్సిన సరుకులు కొనుకున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు  తమ గ్రామాలలోకి ఇతర ప్రాంతాల వారిని అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. 
►తూర్పు గోదావరి జిల్లాలోని నగరాల్లో రోడ్లపైకి వచ్చిన వారిని బలవంతంగా పోలీసులు తిరిగి ఇళ్లకు పంపించేశారు. పెద్దాపురం, ముమ్మిడివరం, జగ్గంపేట నియోజకవర్గాల్లో పలువురికి కరోనా లక్షణాలున్నాయని గుర్తించిన వలంటీర్లు.. వైద్యులకు సమాచారం ఇచ్చారు. అనుమానితులకు పరీక్షల అనంతరం 14 రోజుల పాటు ఇంటిలోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారి కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కొంతమంది కాశీ వెళ్లి అక్కడ చిక్కుకున్నారు.  
►తిరుపతి రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న శ్రీకాళహస్తి యువకుడి కుటుంబ సభ్యులకు కరోనా నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు ఇటీవల లండన్‌ నుంచి వచ్చాడు. పరీక్షల అనంతరం అతనికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతని కుటుంబ సభ్యులు మొత్తం 8 మందికి కూడా పరీక్షలో చేశారు. శ్రీకాళహస్తికే చెందిన మరో యువకుడు, చిత్తూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం రుయాలో ఉంచారు. వారి రిపోర్టులు శుక్రవారం రానున్నాయి. 
►అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో  2,356 క్వారంటైన్‌ పడకలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కోసం వైద్య ఆరోగ్యశాఖకు రూ. 50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. 
►నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అనుమతించడంతో చిత్తూరు జిల్లా వాసులకు కాస్త ఊరటనిచ్చింది. పలు దుకాణాల వద్ద కొనుగోలు బారులు తీరారు. కొన్నిచోట్ల సరుకులన్నీ కొనుక్కుని వెళితే మరికొన్నిచోట్ల వ్యాపారులు డోర్‌ డెలివరీ చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్యశాలల్లో జనరల్‌ ఓపీలు ఆపేసి, అత్యవసర సేవల్ని మాత్రం కొనసాగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేశారు.
►శ్రీకాకుళం జిల్లాలో గురువారం కూడా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా ముగిసింది. అధికారుల ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో నాలుగు చోట్ల తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్దేశిత ధరల ప్రకారం కూరగాయలు విక్రయించారు.

మరిన్ని వార్తలు