ఆతిథ్యరంగం ఆవిరి!

27 Apr, 2020 10:58 IST|Sakshi
నగరంలో మూతపడిన ఓ హోటల్‌       

సాక్షి, కృష్ణా: లాక్‌డౌన్‌ కారణంగా ఆతిథ్య రంగం ఆవిరయింది. వివిధ రంగాలకు చెందిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు వంటి వారు తమ పనుల నిమిత్తం నగరానికి వచ్చి హోటళ్లు, లాడ్జిలలో బస చేసేవారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెల రోజుల నుంచి విజయవాడ నగరంలోని హోటళ్లు, లాడ్జిలు పూర్తిగా మూతపడ్డాయి. అసలే ఆర్థికమాంద్యంతో అంతంత మాత్రంగా ఉన్న హోటల్‌ ఇండస్ట్రీ ఈ మధ్యనే కోలుకుంటోంది. బెజవాడలో వన్‌స్టార్‌ హోటళ్లు సుమారు 100, టూ స్టార్‌ 50, త్రీస్టార్‌ హోటళ్లు 10, రెస్టారెంట్లు 200, సరీ్వసు అపార్ట్‌మెంట్లు 100, లాడ్జిలు 250కి పైగా ఉన్నాయి. హోటళ్లలో 1900, లాడ్జిలు, సర్వీసు అపార్ట్‌మెంట్లలో మరో 5వేల వరకు గదులున్నాయి. విజయవాడలో రోజుకు సగటున 5 వేల మంది గెస్ట్‌లు (పర్యాటకులు, సందర్శకులు, వర్తకులు, వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు) బస చేసేందుకు వస్తారని అంచనా.

నగరంలోని హోటళ్లలో సగటున 65 శాతం ఆక్యుపెన్సీ ఉండేది. రోజుకు హోటళ్ల ద్వారా రూ.25 నుంచి 30 కోట్ల వ్యాపారం జరిగేదని అంచనా. ఇప్పుడదంతా నష్టపోయినట్టేనని హోటల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడ హోటల్‌ పరిశ్రమపై 75 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జిలు తెరచుకోలేదు. వాటిలో పనిచేసే సిబ్బందిలో కొందరు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరికి ఆయా హోటల్‌ యాజమాన్యాలే వసతి కల్పించాయి. ఇంకా హోటళ్లు, రెస్టారెంట్లకు చికెన్, మటన్, చేపలు, కూరగాయలు వంటివి సరఫరా చేసే వారికి కూడా ఉపాధి లేకుండా పోయింది.  

ఇప్పట్లో కోలుకోవడం కష్టమే.. 
కొన్నాళ్లలో లాక్‌డౌన్‌ ఎత్తివేసినా ఆతిథ్య రంగం ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని హోటల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక గెస్ట్‌లు వచ్చినా, రాకపోయినా హోటళ్లు తెరవాల్సిందే. ఏసీలు, జనరేటర్లు, విద్యుత్‌ వినియోగం, నిర్వహణ వ్యయం భరించాల్సిందే. లేనిపక్షంలో కంప్యూటర్లు, ఏసీలు, టీవీలు, వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు పాడవుతాయని అంటున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక కుదుటపడడానికి మరో ఆరేడు నెలలైనా పడుతుందని నగరంలోని మురళీ ఫార్చ్యూన్‌ హోటల్‌ అధినేత మురళి సాక్షితో చెప్పారు.

ఉపశమన చర్యలతోనే ఊరట.. 
లాక్‌డౌన్‌తో హోటల్‌ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. అద్దెల్లో నడుస్తున్న హోటళ్లకు వచ్చే 6నెలలకు సగం అద్దె తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మా పరిశ్రమకు ఇండస్ట్రీ స్టేటస్‌నిస్తే విద్యుత్‌పై యూనిట్‌కు రూపాయి తగ్గుతుంది. లాక్‌డౌన్‌ కాలంలో విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలు, మార్చి నుంచి జూన్‌ వరకు డిమాండ్‌ చార్జీలను రద్దు చేయాలి. ఏడాదిపాటు నీటి పన్ను చెల్లింపు నుంచి మినహాయించాలి. కేంద్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలపై 6–12 నెలలపాటు మారటోరియం విధించాలి. పెండింగ్‌ జీఎస్టీ చెల్లింపునకు 6 నెలలు గడువివ్వాలి. ప్రస్తుతం ఆతిథ్య రంగం కోలుకోవాలంటే ఈ ఉపశమన చర్యలు చేపట్టి ఆదుకోవాలి.  
–పి.రవికుమార్, అధ్యక్షుడు, విజయవాడ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ 

>
మరిన్ని వార్తలు