గడప దాటని కుటుంబాలు 

10 Apr, 2020 08:55 IST|Sakshi
లాక్‌డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన కుటుంబ సభ్యులు 

15 శాతం పెరిగిన విద్యుత్‌ వినియోగం 

స్వీయ నిర్బంధానికి తోడైన వేసవి 

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజలపైనే కాదు..  విద్యుత్‌ వినియోగంపైనా తన ప్రభావాన్ని చూపింది. కరోనా వైరస్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 23 నుంచి విధించిన లాక్‌డౌన్‌తో జిల్లాలో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది.  మార్చి 22న ప్రధాన మంత్రి మోదీ పిలుపుతో జనతా కర్ఫ్యూ జిల్లా అంతటా పాటించారు. మరుసటి రోజు కరోనా వైరస్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మొదటి రెండు, మూడు రోజులు జిల్లాలో సీరియస్‌గా తీసుకోలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతూ కనిపించారు. కరోనా పాజిటివ్‌ కేసుల వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినతరం చేసింది.

జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు ప్రజల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. తొలి విడత ఉదయం ఆరు నుంచి 11 గంటలు, మలి విడత ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటలకు కూడా నిత్యావసరాల కోసం సడలింపు ఇచ్చారు. మొదట రాజమహేంద్రవరం వీరభద్రనగర్‌లో ఒకే ఒక పాజిటివ్‌ కేసు అదీ కూడా లండన్‌ బాయ్‌కు వచ్చింది. ఆందోళన మొదలై చివరకు ఢిల్లీ నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చిన వారితో రెండు, మూడు రోజుల వ్యవధిలోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 11కి చేరడంతో కరోనాను నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. తాజాగా ఆ సంఖ్య గురువారం నాటి కత్తిపూడి పాజిటివ్‌ కేసుతో 12కు చేరుకోవడం ఆందోళనకర పరిస్థితే.  

నిబంధనలతో సాధారణ కుటుంబాల నుంచి సంపన్న కుటుంబాల వరకు ఏ ఒక్కరూ ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటిస్తూ ఎవరి ఇంటిలో వారు ఉండటమే సేఫ్‌ అంటూ పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమమే నడుస్తోంది. ఉదయం లేచిన తరువాత ఎవరి పనులపై వారు బయటకు పోతుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర ఉద్యోగులు తప్ప మిగిలిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ను ధిక్కరించి బయటకు వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన 2,253 మందిని పోలీసులు అరెస్టు చేసి 1254 కేసులు నమోదు చేశారు. 815 వాహనాలు కూడా స్వాదీనం చేసుకున్నారు.  

లాక్‌డౌన్‌ ప్రకటించిన గత నెల 23 నుంచి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రతి ఇంటా విద్యుత్‌ దీపాలు వెలుగుతూ, గదిలో ఫ్యాన్లు తిరుగుతూ, ఏసీలు, విద్యుత్‌ ఉపకరణాలు, టీవీలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. సీబీఎస్‌ఈ మినహా స్టేట్‌ సిలబస్‌ 10వ తగరతి పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్‌ మెయిన్, క్యాంపస్‌ ఇంటర్వ్యూలు ఇలా పలు పరీక్షలు పెండింగ్‌లో పడటంతో విద్యార్థులు, యువత వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి రాత్రనక, పగలనక చదువుతున్నారు.

ఇలా కుటుంబం అంతా 24 గంటలు ఇంటిలోనే గడపాలంటే విద్యుత్‌ లేకుండా నడవదు. ఈ కారణంగా విద్యుత్‌ వినియోగం పెరిగింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యే సమయానికి మరింత పెరగనుంది. కరోనా భయంతో గత మార్చి 23 నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 18 రోజులు జిల్లాలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో గృహ విద్యుత్‌ వినియోగం పెరిగిపోయింది. ఈ నెల 14 వరకూ లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో ఈ మేరకు గృహ విద్యుత్‌ వినియోగం మరింత పెరుగుతుందని ఏపీఈపీడీసీఎల్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో గృహ విద్యుత్‌ వినియోగదారులే ఉన్నారు. కరోనా ప్రభావంతో గృహ విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. ఈ పెరుగుదల మిగిలిన రోజుల్లో వినియోగం కంటే 15 శాతం ఎక్కువగా నమోదైంది. గతంలో ఎప్పుడూ ఇంతటి పెరుగుదల చూడలేదంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు పనిచేయకపోవడంతో ఆ కేటగిరీలలో విద్యుత్‌ వినియోగం 20 శాతం పడిపోయింది. 

గృహ విద్యుత్‌ వాడకం పెరిగింది
కరోనా నిరోధానికి దేశ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఈ కారణంగా గృహ విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం వినియోగం తగ్గింది. కరోనా నేపథ్యంలో  వినియోగదారుల క్షేమం కోరి మీటర్‌ రీడర్స్‌ వినియోగదారుల ఇళ్లకు వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లులు జారీ చేసే పరిస్థితి లేదు. మార్చి నెల విద్యుత్‌ బిల్లునే ఏప్రిల్‌ నెల బిల్లుగా చెల్లించాలి.

ఏప్రిల్‌ నెల బిల్లుగా చెల్లించవలసిన విద్యుత్‌ బిల్లును ఎస్‌ఎంఎస్‌ ద్వారా వినియోగదారులకు తెలిపాం. వినియోగదారులు బిల్లు నుంచి 15 రోజులు లోపు చెల్లించాలి. వినియోగదారులు ఏపీఈపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌లో, పీటీయు యాప్‌ ద్వారా, యూపీఐబీమ్‌ యాప్‌ ద్వారా నెట్‌ బ్యాంకింగ్, గూగుల్‌పే, ఎయిర్‌టెల్‌మనీ, ఫోన్‌పే, ఐసీఐసీఐ ఈజీసీ, భారత్‌బిల్‌పే, జియోమనీ ఆఫ్‌ ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. రాజీవ్‌ ఈపీడీసీఎల్‌ సెంటర్‌లలో, ఏటీపీ మిషన్స్‌ వద్ద ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చు. 
సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి, ఏపీఈపీడీసీఎల్,  ఎస్‌ఈ 

మరిన్ని వార్తలు