కట్టు దిట్టం

6 Apr, 2020 12:38 IST|Sakshi
కడప కోటిరెడ్డి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బారికేడ్లు

కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో పెరిగిన ఆంక్షలు

బఫర్‌ జోన్ల పరిధిలో రెడ్‌ అలెర్ట్‌

11 గంటల వరకు ఉన్న నిబంధన మార్పు చేసిన అధికారులు

ఉదయం 5 నుంచి 8 గంటల వరకే అనుమతి

సాక్షి కడప : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. జిల్లాలో ఇప్పటికే 23 పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఎక్కువ సమయం ఇంటిలోనే గడపాలన్న ఉద్దేశంతో నిత్యావసరాలకు కేటాయించిన సమయాన్ని కూడా కొంతమేర కుదించారు.పాజిటివ్‌ కేసులు వచ్చిన ఏరియాల్లో కోర్‌జోన్, బఫర్‌ జోన్లుగా గుర్తించిన యంత్రాంగం కట్టుదిట్టంగా వ్యవహరించేలా ప్రణాళిక రూపొందించారు.

మాంసం విక్రయాలు నిలిపివేత
జిల్లాలో మాంసపు విక్రయాలు నిలిపి వేశారు. ఆదివారం ఎవరూ చికెన్, మటన్‌ దుకాణాలు తెరవరాదని పోలీసులు శనివారం రాత్రే మైకుద్వారా తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్, మటన్‌ దుకాణాలను తెరుచుకోలేదు.

నిత్యావసరాల సమయం కుదింపు
జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో నిత్యావసరాలు, కూరగాయల కొనుగోళ్లకు సంబంధించి జిల్లా అధికారులు సమయాన్ని కుదించారు. ఇంతకుముందు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సమయం ఉండగా.. ప్రస్తుతం 5 నుంచి 8 గంటల వరకు కుదించారు. ప్రజలకు కూడా ఈ సమయంలో సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించాలని పోలీసు శాఖ సూచిస్తోంది.

హైడ్రోసోడియం క్లోరైడ్‌ పిచికారీ
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హైడ్రోసోడియం క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. ఆదివారం కడప, మైదుకూరు తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏది ఏమైనా కరనా వైరస్‌కు నివారణ ఒక్కటే మార్గం కావడంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూనే నివారణకు యంత్రాంగం ద్వారా అన్ని చర్యలు చేపడుతోంది.

మరిన్ని వార్తలు