కరోనా డేంజర్‌ బెల్స్‌: వారం లాక్‌డౌన్‌

21 Jun, 2020 09:22 IST|Sakshi

సాక్షి, అనంతపురం‌: జిల్లాలో గంటకు నాలుగు కరోనా కేసులు చొప్పున నమోదయ్యాయి. శనివారం ఒక్క రోజే 97 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 789 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్‌ కేసులు 553 కాగా.. డిశ్చార్జ్‌ 230, ఆరుగురు మరణించారు. శనివారం ఉదయం నమోదైన కేసుల్లో, యాక్టివ్‌ కేసుల్లో రాష్ట్రంలోనే ‘అనంత’ ముందంజలో ఉంది. ఇప్పటికే జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఆదివారం నుంచి వారం రోజుల పాటు జిల్లా అధికార యంత్రాంగం లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది.  చదవండి: కుదిపేస్తున్న కోయంబేడు

నమూనాల సేకరణ: 
జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే అనంతపురం వైద్య కళాశాలలో వీఆర్‌డీఎల్, ట్రూనాట్‌ టెస్టింగ్‌ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు కదిరి, బత్తలపల్లి ఆర్డీటీ, హిందూపురం, తదితర ట్రూనాట్‌ టెస్టింగ్‌ సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు జిల్లాలోని వివిధ పీహెచ్‌సీల్లో పాజిటివ్‌ వ్యక్తుల ఫస్ట్‌ కాంటాక్ట్‌ కేసులు, అనుమానితులకు పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకోసం మొబైల్‌ బృందాలను రద్దు చేసి, పీహెచ్‌సీల్లోనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి మొబైల్‌ టెస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో రోజూ వందకుపైగా పరీక్షలు చేపడుతున్నారంటే ఏ స్థాయిలో కోవిడ్‌ అనుమానిత కేసులు వస్తున్నాయో అర్థమవుతోంది.  చదవండి: జేసీకి ఈ గతి వస్తుందనుకోలేదు
  

మరిన్ని వార్తలు