మిడతల దండుపై ఆందోళనొద్దు

29 May, 2020 07:56 IST|Sakshi

తిరుపతి హెచ్‌ఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తడాక్టర్‌ శ్రీనివాసరెడ్డి 

జిల్లాలోకి రాలేదన్న జేడీ హబీబ్, డీడీహెచ్‌ సుబ్బరాయుడు

సాక్షి, అనంతపురం‌: మిడతల దండుపై ఆందోళన వద్దు అని తిరుపతిలోని ఉద్యానశాఖ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. మిడతల దండు జిల్లాలోకి ప్రవేశించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. వ్యవసాయశాఖ జేడీ ఎస్‌కే హబీబ్‌బాషా, ఉద్యానశాఖ డీడీ బీఎస్‌ సుబ్బరాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మహారాష్ట్రలో ఎడారి మిడతల దండు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. గాలివేగం, గమనాన్ని బట్టి వాటి పయనం ఉంటుందన్నారు.

ఒకవేళ మహారాష్ట్రలోని నాగపూర్‌ ప్రాంతానికొస్తే.. అక్కడి నుంచి సరిహద్దు జిల్లాలైన తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మంలోకి ప్రవేశించొచ్చన్నారు. అటు నుంచి రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు, ఇతర ప్రాంతాలకు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. ఇప్పటికైతే ఉభయ రాష్ట్రాల్లో వాడి జాడ లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనంత జిల్లాలోని రాయదుర్గం ప్రాంతానికి చేరుకున్నట్లు, పంటలను దెబ్బతీస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనన్నారు. అవి పదులు, వందల సంఖ్యలో రావన్నారు. వచ్చాయంటే లక్షలు, కోట్లలో వాటి సంఖ్య ఉంటుందన్నారు. జిల్లాలో కనిపిస్తున్న మిడతలు సాధారణంగా సహజంగా ఉన్నవేనన్నారు. చదవండి: మిడతల దండుపై దండయాత్ర

జీవితకాలం 12 వారాలు 
వాటి జీవితకాలాన్ని పరిగణలోకి తీసుకుంటే 12 వారాలు (84 రోజులు) జీవిస్తాయన్నారు. అందులో గ్రుడ్ల నుంచి లార్వా దశలో 2 వారాలు, చిన్న పురుగుల దశ ఆరు వారాలు, రెక్కల పురుగు దశ నాలుగు వారాలు ఉంటుందని శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెక్కల పురుగు దశ కీలకమైందన్నారు.   

ఎడారిలో వీటి ప్రభావం ఎక్కువ 
మిడతల దండు అనేది కొత్త విషయం కాదని శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎడారి ప్రాంతాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. తరచూ రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో కనిపిస్తాయన్నారు. అయితే అవి ఎడాది ప్రాంతాన్ని వదిలేసి జనావాసాలు, పంట పొలాలకు వ్యాపించడం అనేది కొత్తగా చూస్తున్నందున ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. దండు ప్రవేశిస్తే పచ్చదనం లేకుండా నాశనం చేసేస్తాయన్నారు. దీనిపై ఒరిస్సా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులను అప్రమత్తం చేశాయన్నారు. మామిడి సీజన్‌ కావడంతో సాధ్యమైనంత మేరకు కోతలు పూర్తి చేయాలని తెలిపారు. వాతావరణం, పర్యావరణానికి హాని జరగకుండా వేప సంబంధిత మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు వాటి జాడ లేనందున జిల్లా రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.   

మరిన్ని వార్తలు