లోగుట్టేమిటో?

24 Jan, 2015 02:57 IST|Sakshi
లోగుట్టేమిటో?

అనంతపురం సెంట్రల్ : స్త్రీ, శిశుసంక్షేమ శాఖలో బ్యాక్‌లాగ్ పోస్టుకు ఖరీదు కట్టారు. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం భర్తీ చేయరని భావించిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అమ్ముకున్నారు. చివరకు కలెక్టర్ పోస్టులు భర్తీ చేయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెలితే.... వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు పూర్తి చేశారు.

ఇక పోస్టింగ్ ఇచ్చే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున రావడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. అన ంతరం ఎన్నికల హడావుడి, కొత్త ప్రభుత్వం కొలువు దీరడం తదితర పనుల్లో ఉన్నతాధికారులు నిమగ్నం కావడంతో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయం మూలన పడింది. నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు ఖాళీగా 20 పోస్టులు చూపించారు. అయితే పోస్టులను భర్తీ చేయకుండా నాన్చుతుండడంతో పలుమార్లు బాధిత(అంధులు,వికలాంగులు) అభ్యర్థులు ప్రజావాణిలో అర్జీల రూపంలో ఫిర్యాదు చేశారు.

గత నెల 29న ‘ మేము కాదు.. ఈ ప్రభుత్వమే గుడ్డిది’ అన్న శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అప్పటి కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ మూలన పడిన ఫైల్‌ను బయటకు తెప్పించారు. అర్హులైన వారందరికీ పోస్టింగ్ కేటాయిస్తూ పదిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్త్రీ శిశు సంక్షేమశాఖకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అటెండర్ పోస్టుకు  చెన్నేకొత్తపల్లి మండలం న్యామెద్దలకు చెందిన ఆర్.ప్రమీల అనే అంధురాలిని కేటాయిం చారు.

కలెక్టర్ ఉత్తర్వులు అందుకున్న ఆమె నేరుగా ఐసీడీఎస్ కార్యాలయానికి వెళ్లింది. తమకు కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చారని, విధుల్లో చేర్చుకోవాలని కోరిం ది. ఇక్కడే అసలు కథ బయటపడింది. ఇక్కడ పో స్టు ఖాళీగా లేదని అధికారులు సమాధానం చెప్పి పంపారు. దీంతో ఖంగుతిన్న ఆమె చేసేదేమి లేక వెనుతిరిగింది. ప్రస్తుతం తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.
 
కాసులకు కక్కుర్తి పడ్డారా..?
నోటిఫికేషన్‌లో పోస్టును ఖాళీగా చూపిన అధికారులు  కలెక్టర్ భర్తీ చేసే సమయంలోగా లేదని చెప్పడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. పోస్టు మాయం వెనుక అదే శాఖలో ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో పనిచేసే ఓ అధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు కూడా ఖరీదు కట్టి వసూలు చేశాడనే విమర్శలు బలంగా వినిపించారుు.

కొన్నేళ్ల నుంచి ఫెవికాల్ వీరుడుగా ఒకే పోస్టులో కూర్చొని మామూళ్లకు అలవాడు పడినట్లు పలుమార్లు ఉన్నతాధికారులకు అతనిపై ఫిర్యాదులు అందాయి. బ్యాక్‌లాగ్ పోస్టు భర్తీ విషయంలో కూడా ఆయన చక్రం తిప్పినట్లు సమాచారం. అసలు విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుండడంతో సమస్యను చక్కదిద్దేం దుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఒకదానికి బాధిత అభ్యర్థి ప్రమీలను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏయే శాఖల్లో ఇంకా ఖాళీ పోస్టులు ఉన్నా యో అనే అంశంపై కలెక్టరేట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు సంయుక్తంగా కూ ర్చొని చర్చలు జరుపుతున్నారు.

>
మరిన్ని వార్తలు