స్పీకర్ కోడెలతో లోకేష్ భేటీ

21 Aug, 2016 01:17 IST|Sakshi
స్పీకర్ కోడెలతో లోకేష్ భేటీ

3 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ
రాజకీయ ప్రాధాన్యతేమీ లేదన్న కోడెల


 సాక్షి, అమరావతి/ గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ  అయ్యారు. వీరిద్దరూ సుమారు మూడు గంటల పాటు వివిధ అంశాలపై గుంటూరులోని రహదారులు, భవనాల శాఖ అతిధిగృహంలో ఏకాంతంగా విందు సమావేశంలో చర్చించుకున్నారు. తాను సభాపతి కోడెలను కలవక మూడు నాలుగు నెలలు అవుతుందని, గుంటూరులో ఆయన ఉండటంతో వచ్చి కలిశానని లోకేష్ చెప్పారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పీకర్ కోడెల ‘సాక్షి’కి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఈనెల 21వ తేదీన విజయవాడలో సమావేశం జరుగుతుందని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 3 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి ఆదర్శంగా నిలిచినట్లు వెల్లడించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే కోడెల, లోకేష్‌ల మధ్య రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంతోపాటు గుంటూరు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వీరు చర్చించారని తెలిసింది. ప్రభుత్వ పనితీరు, అసెంబ్లీలో పార్టీ వ్యవహరించాల్సిన శైలి, ప్రతిపక్షాన్ని ఎలా అడ్డుకోవాలి అనే అంశంతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించారని సమాచారం. కోడెల ఇటీవల అమెరికాలో పర్యటించి వచ్చారు. అక్కడి ప్రవాసాంధ్రులు ప్రస్తావించిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు