వెక్కిరిస్తున్నాయి.. లోకేషా!

8 Dec, 2018 07:46 IST|Sakshi
కంచె మాత్రమే పూర్తియిన విలేజ్‌ పార్కు , ఐటీ శాఖ మంత్రి ప్రారంభించిన శిలాఫలకం

శిలాఫలకానికే పరిమితమైన అభివృద్ధి పనులు

పూర్తికాని పార్కు నిర్మాణం

పునాదుల దశ దాటని మార్కెట్‌ సముదాయం

పేరు కోసం ఆరాటమో.. చినబాబు మెప్పు కోసమో.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు పెద్ద ఆర్భాటమే చేశారు. మంత్రి లోకేష్‌ పర్యటన ఉందని చెప్పగానే..లేనిపోని పనులను సృష్టించారు. అనుకోగానే శిలాఫలకాలు వెలిశాయి. పూలబాట వేసి డప్పుదరువుల మధ్య ప్రారంభోత్సవాలు కానిచ్చారు. చినబాబు వెళ్లగానే పనులకు పాతరేశారు. నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు.

కర్నూలు, నందవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌ ఎమ్మిగనూరు నియోజవర్గం పర్యటనలో భాగంగా 2018 ఆగస్టు 10వ తేదీన మండల కేంద్రమైన  నందవరంలో పర్యటించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వ రెడ్డి నేతృత్వంలో టీడీపీ నాయకులు నానా హంగామా చేశారు. నందవరంలో  ఆరు రకాల పనులకు శంకుస్థాపనలు కానిచ్చారు. ప్రధానంగా నందవరం మండలం కేంద్రంలోగ్రామ పార్కు, సంత మార్కెట్‌ల పనులకు శ్రీకారం చుట్టారు. రెండు పనుల్లోనూ పురోగతి లేకపోయింది. 

గ్రామ పార్కు పనులకు పాతర?
నందవరం బీసీ కాలనీలో ఎకరా స్థలంలో  రూ.8లక్షల 40 వేలతో పార్కు నిర్మించాలనేది లక్ష్యం. నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగడం లేదు. స్థలం చుట్టూరా కంచెవేసి చేతులు దులుపుకున్నారు. పచ్చదనం   పరుచుకునేలేదు. గ్రామస్తులు నెలలుగా పార్కు కోసం ఎదురుచూస్తున్నారు.  నిధులు సరిపోని, మరో లక్ష పెంచుకునే యత్నంలో కాంట్రాక్టర్‌ ఉండిపోయారు.  

సమస్యల ‘సంత’
నందవరంలోని ఎమ్మిగనూరు రోడ్డు అంచున సంత మార్కెట్‌ నిర్వహణ సాగుతోంది. ప్రతి శనివారం సాయంత్రం కూరగాయల సంత నిర్వహిస్తారు. మండల కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇక్కడి వస్తుంటారు. రోడ్డుపైన విక్రయాలు జరుగుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుమార్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ సముదాయం కోసం రూ.9లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో షెడ్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. అయితే బెస్‌ మట్టం మాత్రమే పూర్తి చేశారు. పైకప్పు, సైడ్‌వాల్‌ పనులు జరగవలసి ఉంది. ప్రారంభం రోజు ఉన్న హడావిడి పనుల్లో లేకపోయింది.  

మరిన్ని వార్తలు