ఇక ఇళ్ల వద్దే..

4 Sep, 2015 00:24 IST|Sakshi

 విశాఖపట్నం (మర్రిపాలెం ) : ఆయా పన్నులు చెల్లించని వాహనదారులపై కొరడా రుళిపించడానికి రవాణా అధికారులు సిద్ధమయ్యారు. గతంలో రోడ్లపై తనిఖీల సమయంలో పట్టుబడినప్పుడు వాహనాలు సీజ్ చేసేవారు. ఇప్పుడు నేరుగా ఇళ్లకు వెళ్లి వాహనాలు అదుపులోకి తీసుకుంటున్నారు. దీనివల్ల రవాణా శాఖకు ఆదాయం సమకూరగా, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రవాణా వాహనాలుగా లారీలు, జీపులు, మ్యాక్సీ క్యాబ్‌లు, బస్సులు, ట్రాక్టర్లు, ఆటోలు ప్రతీ మూడు నెలలకు త్రైమాసిక పన్నులు చెల్లించాలి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 వేల వాహనాలు పన్నులు చెల్లించడం లేదని రవాణా అధికారులు గ్రహించారు.

ఇక నుంచి ప్రతీ 2, 3 మండలాలకు ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేయడానికి డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు నిర్ణయించారు. టీమ్‌లు వాహన యజమాని చిరునామా ఆధారంగా వెళ్లి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు.  ఈ ప్రత్యేక డ్రైవ్ బకాయిల చెల్లింపులు పూర్తి అయ్యేవరకూ కొనసాగిస్తారు. ఆయా వాహనాల బకాయిల వివరాలు రవాణా శాఖ కార్యాలయాలు, మీ-సేవల్లో తెలుసుకోవచ్చని డీటీసీ సూచించారు. యజమానులు స్వయంగా పన్నులు చెల్లిస్తే ఎటువంటి అపరాధ రుసుం ఉండదని, తనిఖీలలో పట్టుబడితే ప్రతీ రూ.100లకు రూ. 200 ఫెనాల్టీ కట్టాలని స్పష్టం చేశారు. ఒకవేళ వాహనం వినియోగించని పక్షంలో కార్యాలయంలో దరఖాస్తు అందచేయాలన్నారు.

కాలం చెల్లిన, పాత వాహనాలు తుక్కు విలువకు అమ్మితే వాహన రికార్డులు కార్యాలయంలో సమర్పించడంతో రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని తెలి పారు. అలా చేయని పక్షంలో ఆయా పన్నులు యజమాని చెల్లించాలన్నా రు. ట్రాక్టర్ తొట్టికి పన్ను చెల్లించి సహకరించాలని కోరారు. ఇంకా తని ఖీల్లో ఫిట్‌నెస్ లేదా పర్మిట్ లేకుంటే రూ.5 వేలు, పొల్యూషన్, డ్రైవింగ్ లెసైన్స్ లేకున్నచో రూ.2 వేలు వసూలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు గురువారం జరిపిన దాడుల్లో 74 వాహనాలు సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు