ఎదురు చూపు

18 Nov, 2014 02:39 IST|Sakshi

కడప రూరల్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సబ్సిడీ రుణాల లక్ష్యాలను విధించింది. నాడు సబ్సిడీ నామమాత్రంగా విడుదల కావడంతో అతి కొద్దిమంది మాత్రమే రుణాలు పొందగలిగారు. అంతలోపే ప్రభుత్వం మారడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కరుణ కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు.

 అరకొరగా అందిన రుణాలు
 జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1284 యూనిట్లకు గానూ ప్రభుత్వ సబ్సిడీ రూ.9 కోట్లు అవసరం కాగా, రూ.3.81 కోట్లు విడుదల కావడంతో 656 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 1119 యూనిట్లకు గానూ రూ.4.54 కోట్లు అవసరం కాగా, రూ.3.02 కోట్లు విడుదల కావడంతో 776 మంది రుణాలు పొందగలిగారు.

 ఎస్టీ, బీసీల పరిస్థితి దారుణం
 గిరిజన సంక్షేమశాఖ ద్వారా 194 యూనిట్లకు గానూ రూ.138 కోట్లు అవసరం కాగా, ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవంతో ఎవరూ రుణాలు పొందలేకపోయారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.3134 యూనిట్లకు గానూ రూ.940 కోట్లు అవసరం. అయితే, ఒక్క పైసా కూడా విడుదల కాకపోవడంతో ఒక్కరు కూడా రుణం పొందలేకపోయారు.

 101 కష్టాలను ఎదుర్కొని...
 గడిచిన ఆర్థిక సంవత్సరంలో రుణ మంజూరుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టింది. బ్యాంకు లింకేజీ కింద ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీని జమ చేసేలా చర్యలు చేపట్టింది. దీంతో సబ్సిడీ నేరుగా తమ ఖాతాల్లో పడుతుందని లబ్ధిదారులు ఆశ పడ్డారు. ఈ తరుణంలోనే రుణాల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం గుదిబండ లాంటి 101 జీఓను జారీ చేసింది.

ఈ జీఓ ప్రకారం వయసు నిబంధనను విధించారు. రేషన్, ఆధార్ కార్డులను తప్పనిసరి చేశారు. ఫలితంగా అర్హులైన ఎంతోమంది జీఓ కారణంగా అనర్హులుగా మిగిలారు. మిగిలిన కొంతమంది రుణ అర్హత పొందారు. ప్రభుత్వం నామమాత్రంగా సబ్సిడీని మంజూరు చేయడంతో అతికొద్ది మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. అంతలోపే ఎన్నికలు ముంచుకొచ్చాయి.

 ఎస్సీ కార్పొరేషన్‌కు కొత్త లక్ష్యాలు
 జిల్లా ఎస్సీ కార్పొరేషన్ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. 1994 బ్యాంకు లింకేజీ యూనిట్లను 1950 మందికి అందజేయాలని సూచించారు. అందులో ప్రభుత్వ సబ్సిడీ వాటా రూ. 12.26 కోట్ల మేర ఉంది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ సాగుతోంది.  

 ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం!
 2013-14లో రుణాలకు అర్హులైన వారి వివరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం సబ్సిడీని మంజూరు చేస్తే, మిగిలిన వారికి కూడా రుణాల మంజూరుకు మార్గం సుగమమవుతుంది.  
 - ఎస్.ప్రతిభా భారతి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్
 
 2013-14లో ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందిన వారి వివరాలు
 కార్పొరేషన్    యూనిట్లు       రుణాలు పొందిన    సబ్సిడీ అవసరం     మంజూరైన సబ్సిడీ
                                                 లబ్ధిదారులు    (రూ. కోట్లలో)        (రూ. కోట్లలో)
 ఎస్సీ               1284               656                  9.00                3.81
 ఎస్టీ                   194                --                     1.38                    --
 బీసీ                 3134                --                    9.40
 మైనార్టీ            1119               776                  4.54                3.06
 మొత్తం            5731            1432                24.32               6.83

మరిన్ని వార్తలు