ఓడిన అభ్యర్థికి గెలిచినట్టు డిక్లరేషన్

3 Aug, 2013 02:56 IST|Sakshi

కోడుమూరు రూరల్, న్యూస్‌లైన్: వార్డుమెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థినికి గెలిచినట్టుగా డిక్లరేషన్ ఇచ్చిన విచిత్ర సంఘటన కోడుమూరు మండల పరిధిలోని పులకుర్తి గ్రామంలో నెలకొంది. గ్రామంలోని 11వ వార్డుకు బి.కె.పద్మావతి వైఎస్సార్సీపీ పార్టీ తరుఫున, బోయ రంగమ్మ టీడీపీ తరఫున పోటీ చేశారు. గత నెల 23వ తేదీన జరిగిన ఎన్నికల్లో బికె.పద్మావతికి 159 ఓట్లు, బోయ రంగమ్మకు 43 ఓట్లు వచ్చాయి. 71 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. ఈ వార్డులో బీకే పద్మావతి 116 ఓట్లతో గెలిపొందారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయానంద్.. బోయ రంగమ్మ గెలుపొందినట్లు డిక్లరేషన్ ఇచ్చారు.
 
 ఈ డిక్లరేషన్ పత్రాన్ని బోయ రంగమ్మకు పంచాయతీ కార్యదర్శి సతీష్ శుక్రవారం అందజేశారు. తాను ఓడిపోయానని చెప్పినా వినకుండా డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారని రంగమ్మ  తెలిపారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా రికార్డుల్లో రంగమ్మనే గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి రాసిచ్చారని అందుకే డిక్లరేషన్ ఇచ్చామని తెలిపారు. దీంతో పద్మావతి వర్గీయులు కోర్టును ఆశ్రయించనున్నారు. అలాగే సర్పంచు ఓట్ల లెక్కింపులో కూడా అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇప్పటికే సర్పంచు ఓట్లను రీకౌంటింగ్ చేయాలని కోర్టుకు వెళ్లారు.
 
 సరిచూస్తున్నాం : ఆంథోని, ఎంపీడీఓ
 పొరపాటు జరిగినట్లు పంచాయతీ సెక్రటరీ నా దృష్టికి తెచ్చాడు. ఆ రోజు పోలైన ఓట్లు సరిచూస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో చూసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.

మరిన్ని వార్తలు