శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు

30 Nov, 2019 09:30 IST|Sakshi
ప్రత్యేక అలంకారంతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పుట్టతో కొలువుదీరిన సుబ్బారాయుడు

సాక్షి, బిక్కవోలు (అనపర్తి): రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జంగా వీర వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 1 నుంచి ఎనిమిదో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకటో తేదీ రాత్రి తెల్లవారితే రెండో తేదీ సోమవారం 1:10 గంటలకు స్వామి వారి తీర్థపు బిందె సేవతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. షష్ఠి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సోమవారం ఉదయం నుంచి సన్నాయి, బ్యాండ్‌ మేళాలతో సందడిగా ఉంటుంది. రాత్రికి భక్తిరంజని కార్యక్రమం, 3న స్వామివారి రథోత్సవం, 8న అన్నదానం కార్యక్రమంతో షష్ఠి ఉత్సవాలు పూర్తవుతాయి. 

దేదీప్యమానంగా విద్యుత్తు కాంతులు 
షష్టి ఉత్సవాలకు ఆలయ పరిసరాలు విద్యుత్తు దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ప్రధాన రహదారిలో సినిమా సెంటర్‌ నుంచి వంతెన వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్‌ఈడీ దీపకాంతులను ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన కూడళ్లలో దేవతామూర్తులు, వివిధ అంశాలతో కూడిన ఎల్‌ఈడీ బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. అలాగే చలువ పందిళ్లను రంగురంగుల వస్త్రాలతో అలంకరించారు. 

ఆలయ చరిత్ర  
దాదాపు 1100 ఏళ్ల చర్రిత కలిగిన బిక్కవోలులో వేంచేసిన గోలింగేశ్వరస్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అతి ప్రాచీన శివక్షేత్రాల్లో ఒకటి. తూర్పు చాళుక్యుల శిల్పాకళా వైభవంతో నిర్మించిన అనేక పురాతన ఆలయాల్లో ఇది ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రమాదిత్యుడి పేరిట విక్రమపురంగా, మూడో విజయాదిత్యుడిగా పిలవబడిన గుణగవిజయాదిత్యుని కాలం క్రీస్తు శకం 849–892లో బిరుధాంకినవోలుగా పిలుస్తారు. కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. తూర్పు చాళుక్య రాజుల్లో గుణగవిజయాదిత్యుడు, చాళుక్యభీముడు (క్రీ.శ.892–921) సుప్రసిద్ధులు, గొప్పశివ భక్తులు. వీరిలో గుణగవిజయాదిత్యుడు పశ్చిమ గంగులు, రాష్ట్రకూటులు, కళింగులతో యుద్ధాలు చేసి విజయం సాధించి, శత్రు సంహార పాప పరిహారం కోసం 108 శివాలయాలు నిర్మించగా చాళుక్య భీముడు తన పరిపాలనా కాలంలో 360 శివాలయాలు నిర్మించారు.
                                              
వీటిలో 101 శివాలయాలు బిక్కవోలు నిర్మించారని పూర్వీకులు చెబుతారు. ఈ గ్రామం దండుపుంత మార్గంలో ఉండుట వల్ల కాలగమనంలో తురుషు్కలు దండయాత్రలు, మురాఠి యుద్ధాల వల్ల చాలా దేవాలయాలు, విగ్రహాలు ధ్వంసమయ్యాయి. నేడు బిక్కవోలు గ్రామాన ఆరు దేవాలయాలు అలనాటి చాళుక్యుల శిల్పాకళా వైభవానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.  ఈ గోలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు, కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారు దక్షిణ ముఖంగా విజయ గణపతి స్వామి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి వారు ఉత్తర ముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయం ఇరుపక్కలా చంద్ర శేఖరస్వామి, రాజరాజేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉంటాయి. 

                                          ఆలయ ముఖ ద్వారం

కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
ఆలయంలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బ్రహ్మచారిగా కొలుస్తున్నారు. ఈ స్వామి అత్యంత తేజస్సు కలిగి చతుర్బుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. స్వామికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్ట ఉంది. ప్రతిరోజూ రాత్రి పళ్లెంలో పాలు పోసి ఇక్కడ ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం. కుమార స్వామి పళనిలో మాదిరిగానే దక్షిణ ముఖంగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకాలు జరిపిస్తే స్వామి అనుగ్రహం కలిగి, బాధలు తీరతాయని భక్తుల నమ్మకం. అంగారక క్షేత్రంగా పిలవబడే ఈ దేవాలయంలో దోషనివారణ పూజలు చేయడం వల్ల వివాహం కాని వారికి  వివాహం, సంతానం లేని వారికి సంతానం లభిస్తుందని ప్రజల నమ్మకం.

సంతాన ప్రాప్తి కోసం నాగుల చీర
మార్గశిర శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామి వారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రిస్తే స్వామి సంతాన ప్రాప్తి కలుగ చేస్తాడని పూర్వం నుంచి భక్తుల నమ్మకం. ఈ విశ్వాసంతోనే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

                              సంతానం కోసం ఆలయం నిద్రహిస్తున్న మహిళలు

ఏర్పాట్లు పూర్తి చేశాం
షష్టి ఉత్సవాలకు ఏర్పాటు పూర్తిచేశాం. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశాం. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల రక్షణకు 200కిపైగా పోలీసు సిబ్బందితో భక్తులకు సేవలందించడానికి సేవాసమితి వలంటీర్లు ఏర్పాటు చేశాం.
జంగా వీరవెంకట సుబ్బారెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్, బిక్కవోలు

మరిన్ని వార్తలు