శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?

20 May, 2018 12:13 IST|Sakshi

లోగుట్టు పెరుమాళ్లకెరుక

నోరు మెదపని టీటీడీ అధికారులు

 భక్తుల్లో పెరుగుతున్న అనుమానాలు 

తిరుమల శ్రీవారికి చెందిన వేల కోట్ల విలువజేసే ఆభరణాల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. చెన్నై మీడియా సమావేశంలో అప్పటి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు స్వామివారి ఆభరణాలపై సందేహాలను వ్యక్తం చేసినప్పటి నుంచీ భక్తుల్లో అనుమానాలు మరింత పెరిగాయి.  శ్రీకృష్ణదేవరాయల ఆభరణాలను ప్రత్యక్షంగా చూసి వాటిపై కొద్దోగొప్పో అవగాహన ఉన్న రమణ దీక్షితులు వంటి ప్రముఖ వ్యక్తే సందేహాలను వెలిబుచ్చడం చర్చకు దారి తీసింది. 

సాక్షి ప్రతినిధి, తిరుపతి : విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన వేల కోట్ల ఖరీదుజేసే బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాల భద్రతపై టీటీడీ వర్గాలు నోరు మెదపడం లేదు. మూడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు, మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు. దీంతో రాయల వారి నగలపై స్పష్టమైన వివరణ ఇవ్వడంలో టీటీడీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత మంగళవారం చెన్నైలో అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టీటీడీలో వంశపారంపర్యంగా వస్తున్న అర్చక వారసత్వాన్ని రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధ«మని రమణ దీక్షితులు విమర్శించారు.

 ఈ సందర్భంగా ఆయన శ్రీవారి బంగారు ఆభరణాల భద్రతను ప్రశ్నించారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో స్వామి వారికి అందజేసిన వేల కోట్ల విలువజేసే ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి... ఎంత మేరకు భద్రంగా ఉన్నాయని టీటీడీ అధికారులను నిలదీశారు. ఆభరణాల లెక్కలను బహిరంగపరిచి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని రమణ దీక్షితులు టీటీడీ వర్గాలను కోరారు. కొత్తగా స్వామి వారికి కా నుకల రూపంలో అందిన ఆభరణాలను మాత్రమే ఉత్సవాల సమయంలో అలంకరిస్తున్నారనీ, పాత నగలను బయటకు తీయడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవలనే టీటీడీకి చెందిన రూ.1000 కోట్ల నగదును అధికారులు ఓ ప్రయివేటు బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. 

దీంతో భద్రతను ప్రశ్నిస్తూ  శ్రీవారి భక్తుడు నవీన్‌కుమార్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో డిపాజిట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. సరైన సమాధానం చెప్పలేక టీటీడీ అధికారులు సతమతమయ్యారు. ఈ నెల 16న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సదరు డిపాజిట్ల పర్యవేక్షణ కోసం సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ వెల్లడించారు. ఒకవైపు డిపాజిట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీవారి విలువైన ఆభరణాలపై సందేహాలు వెల్లువెత్తడం టీటీడీ వర్గాలను కుదిపేస్తోంది. కచ్చితమైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలే పరిస్థితి నెలకొంది. అయితే కొత్తగా విధుల్లో చేరిన నూతన ప్రధాన అర్చకులు మాత్రం ఆభరణాలకు చెందిన రికార్డులన్నీ ఉన్నాయని బదులిచ్చారు. 


లోగుట్టు పెరుమాళ్ల కెరుక....
16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలు తిరుమలాదేవి, చిన్నమదేవితో కలిసి 7 సార్లు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పట్లో రాయలవారు దర్శనానికి వచ్చిన ప్రతిసారీ విలువైన బంగారు, వజ్ర, నవరత్నాలతో కూడిన వజ్ర కిరీటాలు, భుజకీర్తులు, కంఠహారాలు, స్వర్ణ ఖడ్గాలను స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించారు. 1513 ఫిబ్రవరి 10వ తేదీ తొలిసారి సందర్శించినపుడు నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అందజేశారు. అదే సంవత్సరం మే 2వ తేదీ రెండోసారి రాయల వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అప్పట్లో మరో కిరీటం, పతకాలు, హారాలు, వెండి హారతి పళ్లాలు అందజేశారు.

ఆ తరువాత పుత్రసంతానం కలిగాక భార్య తిరుమలాదేవితో కలిసి వచ్చి (1518 అక్టోబర్‌ 16) తిరుమల వెంకన్నను దర్శించి బంగారు పీతాంబరాలు, నవరత్నాలను సమర్పించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. మహంతుల కాలంలో కొన్నింటిని కరగబెట్టి కొత్త ఆభరణాలు చేయించే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. ఆ తరువాత 1996 వరకూ కొన్ని ఆభరణాలను అడపా దడపా స్వామి వారికి అలంకరిస్తూ వచ్చారు. ఆ తరువాత కొత్త ఆభరణాలు వచ్చి చేరుతుండటంతో పాత వాటి జోలికెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో అసలు రాయల వారి ఆభరణాల మాటేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికైనా టీటీడీ వర్గాలు భక్తుల సందేహాలకు సరైన సమాధానం చెప్పి భక్తుల్లో నమ్మకాన్ని, భరోసాను పెంచాల్సిన అవసరం ఉంది. 

అధికారులు సమాధానం చెప్పాలి
శ్రీవారికి ఉన్న వేల కోట్ల విలువైన ఆభరణాలపై భక్తుల్లో అనుమానాలు తీవ్రతరంకాక ముందే టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలి. ఏఏ ఆభరణాలు ఎక్కడ, ఏ రకమైన భద్రతలో ఉన్నాయో వివరిం చాలి. సాక్షాత్తు ఆలయ ప్రధాన అర్చకులై, ఆగమ సలహాదారులుగా వ్యహరించిన రమణ       దీక్షితుల వంటి పెద్దలు సందేహాలను వ్యక్తం చేయడం చూస్తే ఏదో జరుగుతోందన్న సందేహాలు             తలెత్తుతున్నాయి. 
 నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్‌పీఎస్‌ కన్వీనర్, తిరుపతి

ఆభరణాల నిర్వహణ లోపభూయిష్టం 
స్వామి వారి ఆభరణాల నిర్వహణ బాధ్యతలు సరిగా లేవు. అంతా లోపభూయిష్టంగా ఉంది. కోట్ల విలువైన ఆభరణాలపై కనీస జబాబుదారీతనం లేకుండా పోయింది. ఆభరణాలను భక్తుల సందర్శన కోసం ఉంచడం శ్రేయస్కరం.              
  – పురుషోత్తమ రెడ్డి, రాయలసీమ మేథావుల ఫోరం

మరిన్ని వార్తలు