భయపెడుతున్న భారీ వాహనాలు

2 Sep, 2019 08:51 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : లారీలు పోటాపోటీగా వెళ్లే క్రమంలో వారు ప్రయాణిస్తున్న వేగం రోడ్డుపై ప్రయాణించే వారిని గందరగోళానికి గురిచేస్తున్నట్టు పలువురు వాహనదారులు చెబుతున్నారు. ఇటీవల ఈ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి.  జాతీయ రహదారి నుంచి సజ్జాపురం కోయాక్సిల్‌ రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ ఆవరణలోని వ్యాగిన్‌లకు ఎక్కించేందుకు బియ్యం లోడుతో లారీలు ప్రయాణిస్తున్న వేగం 50 కిలోమీటర్లకు పైనే. అధిక లోడుతో వేగంగా వెళ్తున్న ఈ లారీలు వస్తున్న తీరు చూసి ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు తమ వాహనాలను డ్రెయిన్లపైకి నడుపుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా లారీలో క్లీనర్‌ లేకుండా డ్రైవర్‌ మాత్రమే ఉండటంతో ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులు నిలదీస్తుంటే లారీల డ్రైవర్లంతా ఏకమైపోయి వాగ్వాదానికి దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. 

దారిలో 4 పాఠశాలలు 
ఇదే రహదారిలో 4 ప్రైవేటు పాఠశాలలు ఉండడంతో తల్లితండ్రులు ఈ బియ్యం రవాణా చేసే లారీలు తిరిగే రోజుల్లో పిల్లలను రోడ్డుపైకి వెళుతుంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రితోపాటు ఈఎస్‌ఐ ఆస్పత్రి కూడా ఇదే రహదారిని ఆనుకుని ఉన్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు సైకిళ్లపై వెళ్లే పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంత జరుగుతున్నా లారీలు తిరిగే సమయంలోనైనా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయడంలేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల వేగాన్ని నియంత్రించాలని, లారీల్లో క్లీనర్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వేగంగా రాకపోకలు
బియ్యం లోడుతో వెళ్తున్న లారీల వేగాన్ని చూస్తుంటే భయమేస్తోంది. పిల్లలను ఇళ్లలోంచి బయటకు వదలేకపోతున్నాం. ముందుగా వెళ్లాలనే లక్ష్యంతో పోటీపడి వెళుతున్నారు. ప్రమాదం జరుగుతుందేమో అనే భయం డ్రైవర్లలో లేదు. లారీలు ప్రయాణం చేసే రోజుల్లోనైనా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయాలి.
వై.శ్రీహరి, కోయాక్సిల్‌ రోడ్డు, తణుకు 

చర్యలు తీసుకుంటాం 
కోయాక్సిల్‌ రోడ్డులో ప్రయాణించే బియ్యం రవాణా లారీలు నిబంధనలకు లోబడి ప్రయాణించాలి. వేగంగా వెళ్లినా, క్లీనర్‌ లేకుండా వాహనం నడిపినా సదరు లారీల యజమాని, డ్రైవర్లపై చర్యలు తీసుకుంటాం. ఈ లారీల కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి.
– డి.చైతన్య కృష్ణ, తణుకు సీఐ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా