డంపింగ్‌ యార్డు తొలగించాల్సిందే..

9 Apr, 2018 08:40 IST|Sakshi
అసోసియేషన్‌ కార్యాలయం వద్ద నిలచిపోయిన లారీలు..

‘చెత్త’ సమస్యపై రగిలిన లారీ ఓనర్లు

యార్డుకు అడ్డంగా లారీ నిలిపి నిరసన

రేవు కార్యకలాపాలకు అంతరాయం

కాకినాడ : డంపింగ్‌యార్డు సమస్యతో సతమతమవుతున్న లారీ యజమానులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. లారీ యజమానుల సంఘ కార్యాలయం పక్కనే చెత్త వేసి తగలబెట్టడంతో వచ్చే కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వారు ఆదివారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోగా రేవు ద్వారా జరిగే రవాణా కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కాకినాడ రాజీవ్‌ గృహకల్ప సమీపంలోని పర్లోపేట వద్ద ఎఫ్‌సీఐ గొడౌన్లను ఆనుకుని ఉన్న స్థలంలో చాలా కాలంగా చెత్త డంప్‌ చేస్తున్నారు. నగరానికి డంపింగ్‌యార్డు లేకపోవడంతో నిత్యం సేకరించే చెత్తను అక్కడకు తరలించి తగలబెడుతున్నారు.

దీంతో ఇదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తతోపాటు జంతు కళేబరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను తగలబెట్టడంతో విపరీతమైన దుర్వాసన, పొగ ఆవరించి ఆ ప్రాంతం మీదుగా వెళ్లలేని దుస్థితి నెలకొందంటూ చాలాకాలంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. పైగా లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులతో పాటు చుట్టుపక్కల ఉండే సంజయ్‌నగర్, పర్లోపేట, దుమ్ములపేట ప్రాంతవాసులు రోగాలు, వ్యాధులతో సతమతమవుతున్నామని గతంలో కూడా రెండుమూడుసార్లు ఆందోళనకు దిగగా అధికారులు, ప్రజాప్రతినిధులు నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గారు. తాజాగా డంపింగ్‌ యార్డు కోసం సామర్లకోట సమీపంలో స్థలం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, డంపింగ్‌ సమస్య మాత్రం యథావిధిగా కొనసాగడంపై లారీయజమానులు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు.

ఆగిన లారీలు...
కాకినాడ లారీ అసోసియేషన్‌ పరిధిలోని దాదాపు 2,500 లారీలను ఆదివారం ఎక్కడికక్కడ నిలిపివేశారు. డంపింగ్‌యార్డు తరలింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు బంద్‌ విరమించేదిలేదంటూ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాజాన సూర్యప్రకాష్, ముత్యం తేల్చిచెప్పారు. పైగా డంపింగ్‌కు వాహనాలు వెళ్ళే రహదారి వద్ద లారీని అడ్డంగాపెట్టారు. కార్పొరేషన్‌ పారిశుద్ధ్య వాహనాలు వెళ్ళకుండా నిరోధించారు. దీంతో దిగివచ్చిన కార్పొరేషన్‌ యంత్రాంగం, పోలీసులు, ప్రజాప్రతినిధులు లారీ అసోసియేషన్‌ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అయితే  తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేస్తున్నారు. మరో వైపు లారీ అసోసియేషన్‌ ద్వారా జరిగే రేవు కార్యకలాపాలపై బంద్‌ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. నిత్యం రేవు ద్వారా సుమారు 300లకు పైగా లారీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు బియ్యం, బొగ్గు, కెమికల్స్‌ వంటి వస్తువులను రవాణా చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపు స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రవాణారంగంతోపాటు రేవు కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా