కదలని చక్రం లారీ డ్రైవర్ల కొరత

3 May, 2019 12:46 IST|Sakshi

వేలల్లో లారీలు.. వందల్లో డ్రైవర్లు

ఉద్యోగానికి ఆసక్తి చూపని వైనం

సమాజంలో గుర్తింపు లేకపోవడం ఒక కారణం

డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ వ్యవస్థగా రూపాంతరం

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: లారీడ్రైవర్‌.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉద్యోగం.. మోటార్‌ ఫీల్డ్‌పై ఆసక్తితో చాలా మంది ఇటుగా వెళ్లేవారు. లారీలపై క్లీనర్‌లుగా పనిచేస్తూ డ్రైవింగ్‌ నేర్చుకుని లైసెన్స్‌లు పొంది గొప్పగా భావించేవారు. లారీ డ్రైవర్‌ అనేమాట స్టేటస్‌ సింబల్‌గా కూడా ఉండేది. మోటారు పరిశ్రమ, లారీ పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జిల్లాలో వేలాది కుటుంబాలు జీవించేవి. నాలుగు టైర్ల లారీల నుంచి పది టైర్ల లారీల వరకు పరిశ్రమ విస్తరించినా, టైర్లు పెరిగినంత సులభంగా ఈ పరిశ్రమలో అభివృద్ధి చోటుచేసుకోలేదు. పాత రోజుల్లో డ్రైవర్‌గా లారీ ఎక్కాలంటే పెద్ద సిఫారసు ఉండాలి. ముందుగా మెకానిక్‌ షెడ్‌లో వర్కర్‌గా చేరాలి. తర్వాత లారీ మీద క్లీనర్‌గా పనిచేయాలి. డ్రైవర్‌ను గురూ అంటూ మచ్చిక చేసుకోవాలి. తర్వాత డ్రైవర్‌గా మారాలి. ఇదంతా గతం. రానురాను పరిస్థితులు మారడంతో లారీ డ్రైవర్ల కొరత ఈ రంగంలో కనిపిస్తోంది. లారీ డ్రైవర్లుగా పనిచేసేందుకు ఎవరూ మక్కువ చూపకపోవడంతో డ్రైవర్లకు డిమాండ్‌ పెరిగింది.

డ్రైవింగ్‌ కళాశాల ఏర్పాటు
డ్రైవర్ల సమస్యను ముందుగానే ఊహించిన లారీ యజమానుల సంఘం డ్రైవర్ల శిక్షణ కోసం డ్రైవింగ్‌ కళాశాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ సీటు కావాలన్నా సిఫార్సులతోనే వచ్చేది. ప్ర స్తుతం బతిమాలినా ఎవరూ డ్రైవర్లుగా కళాశాలకు వెళ్లని పరిస్థితి నెలకొంది.

20 శాతం మంది మాత్రమే..
జిల్లాలో ఒక్క తాడేపల్లిగూడెంలో వెయ్యి లారీలకు పైగా ఉన్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, నిడదవోలు, చింతలపూడి వంటి ప్రాంతాల్లో మరో వెయ్యికి పైగా లారీలు ఉన్నాయి. వీటిని నడపడానికి కేవలం అందుబాటులో 20 శాతం మంది మాత్రమే డ్రైవర్లు ఉన్నారు.

ఇతర రాష్ట్రాల డ్రైవర్లే దిక్కు
చేపలు, ఇతర సరుకులను తీసుకువెళ్లే నేషనల్‌ పర్మిట్‌ లారీల్లో ఎక్కువగా పనిచేసేది అసోం, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలకు చెందిన డ్రైవర్లు. డ్రైవర్‌ ఉద్యో గం ఒడుదుడుకులతో కూడుకుంది కావడం, శారీరక శ్రమ ఉండటం, మా రుతున్న పరిస్థితులు, డ్రైవర్‌ అంటే సమాజంలో గుర్తింపు లేకపోవడం డ్రైవర్లు తగ్గడానికి కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఆదాయం  వస్తున్నా.. ఆదరణ సున్నా..
డ్రైవర్‌గా పనిచేస్తే నెలకు జీతం, బేటా, కమీషన్‌లు అన్నీ కలిపి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం ఉంటుంది. దూర ప్రాంతాలకు టిప్పులకు వెళితే డ్యూటీ దిగే సమయానికి రూ.20 వేలకు పైగా మిగులుతుంది. అసోం, కోల్‌కత, ఒడిసా, బిహార్‌ వంటి రాష్ట్రాలకు చేపలు, కోడిగుడ్లు లోడులు తీసుకువెళితే రూ.లక్ష కిరాయిలో ఫిక్స్‌డ్‌గా డ్రైవర్‌కు రూ.30 వేల వరకు ముట్టచెబుతున్న సందర్భాలు ఉన్నాయి.

ఖర్చులు తడిసిమోపెడు
లారీకి థర్డ్‌ పార్టీ ఇన్సూ్యరెన్స్‌గా రూ.45 వేలు కట్టాలి. మరమ్మతులు పెరిగాయి. ఆపరేటర్‌కు గుర్తింపులేదు. ఇలా ఖర్చులు పెరిగిపోవడంతో డ్రైవర్లు దొరక్క ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ వ్యవస్థగా లారీ పరిశ్రమ మారిపోయింది. యజమానులే డ్రైవర్లుగా లారీలను నడుపుతున్నారు. పరిశ్రమ నుంచి భారీ స్థాయిలో ఆదాయాలు ప్రభుత్వాలకు సమకూరుతున్నా.. వ్యవస్థలో కష్టాలు గురించి పట్టించుకునేవారు లేరు. కునారిల్లుతున్న ఈ పరిశ్రమలో డ్రైవర్‌గా చేరడానికి చాలా మందికి ఇష్టం లేకపోవడమే డ్రైవర్ల కొరతకు కారణంగా కనిపిస్తోంది.

చేతి చమురు వదులుతుంది
పది టైర్ల లారీకి ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.80 వేలు ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. కిరాయిలు, ఖర్చులు, టోల్‌గేట్లు ఇలా ఖర్చులు మోతతో ఇబ్బందులు పడుతున్నాం. మిగిలిదే ఏమీ ఉండటం లేదు. లారీలు తిప్పలేకపోతున్నాం. ఇంటికి పట్టుకుని వెళ్లేది ఏమీ ఉండటం లేదు. మాకు చేతి చమురు వదులుతుంది. అరకొర జీతాలతో లారీలపై పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
–ఎస్‌.రాజారావు, లారీ డ్రైవర్, తాడేపల్లిగూడెం

మరిన్ని వార్తలు