మన్యంలో మగ్గిపోతున్నామయ్యా..

25 Nov, 2018 11:36 IST|Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అయ్యా.. మావి గిరిజన గ్రామాలు.. కనీస వసతులు లేక కునారిల్లుతున్నాం.. గొంతు తడుపుకుందామంటే మంచి నీటికి కూడా కరువే.. కలుషిత నీరే మాకు దిక్కు.. రాకపోకలకు రహదారులూ సక్రమంగా లేవు.. రోగమొస్తే దైవాధీనం.. సమస్యల గురించి పాలక పార్టీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు.

అధికారులూ శ్రద్ధ చూపడం లేదు’ అని వివిధ గ్రామాల గిరిజనులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 304వ రోజు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కురుపాం నియోజకవర్గంలోని జియమ్మవలస మండల గ్రామాల్లో పాదయాత్ర సాగించారు. ఈ క్రమంలో తురకనాయుడు వలస వద్ద 3,300 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు.

శిఖబడి క్రాస్‌ నుంచి ప్రారంభమైన యాత్ర గెడ్డతిరువాడ, ఇటిక, కుందరతిరువాడ క్రాస్, చిన్నకుడమ క్రాస్, తురకనాయుడువలస వరకు సాగింది. ఆద్యంతం మన్నెం ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. తాము ఎదుర్కొంటున్న అసంఖ్యాకమైన సమస్యలను జననేత దృష్టికి తెచ్చారు. అంకువరం, చిన్న బుడ్డివరం గ్రామ మహిళలు జగన్‌ను కలిసి తమకు తాగునీరు అందడం లేదని మొర పెట్టుకున్నారు.

గెడ్డకు వెళ్లి కలుషిత నీరు తెచ్చుకుని తాగాల్సిన దుస్థితిలో ఉన్నామని వాపోయారు. ఈ నీటి వల్ల తరచూ అనారోగ్యం పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 


సంక్షేమ పథకాలన్నీ వారికేనట.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమ గ్రామాల కోసం ఒక ఫిల్టర్‌ బావిని ఏర్పాటు చేసినా, ఈ పాలకులు అక్కడి నుంచి పైపులు, కొళాయిలు వేసిన పాపాన పోలేదని ప్రజలు జగన్‌ ఎదుట వాపోయారు. అధికార పార్టీ నాయకులకు ఎన్నిమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

అలమండ, కొండ చిలకాం, టీకే జమ్ము, పెద్ద తోలుమండ గ్రామాల్లో కనీస వసతులు లేవని, అనేక సమస్యలున్నాయని తూర్పు ముఠా గ్రామాల గిరిజనులు వివరించారు. రావాడ రామభద్రాపురం వద్ద 2004లో వైఎస్‌ గిరిజన పాఠశాలను మంజూరు చేశారని, గిరిజన రైతులు అందుకోసం పొలం ఇచ్చినా ఆ తర్వాత దాని అతీగతీ లేదన్నారు.

రావాడ రామభ్రద్రాపురంలో ఉన్న పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో పరిస్థితులు మెరుగు పరిచేలా చూడాలని విన్నవించారు.  జియమ్మవలస గ్రామానికి వట్టి గెడ్డ రిజర్వాయరుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇవ్వాలని పలువురు కోరారు. ఆధార్‌తో అనుసంధానం చేయలేదని కొద్ది నెలలుగా తనకు రేషన్‌ బియ్యం ఇవ్వడం లేదని శిఖబడి గ్రామం వద్ద ఓ మహిళ ఫిర్యాదు చేసింది.  

టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, రుణాలను ఇస్తున్నారని అర్హులైన తమకు మంజూరు చేయడం లేదని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. జన్మభూమి కమిటీల ఇష్టానుసారం పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను జగన్‌ వద్దకు తీసుకు వచ్చి వారి అనారోగ్య సమస్యలను చెప్పుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం వచ్చేలా చూడాలని కోరారు.   

      తురకనాయుడు వలస వద్ద 3,300 కి.మీ అధిగమించిన పాదయాత్ర,  మొక్క నాటుతున్న వైఎస్‌ జగన్‌   
తిత్లీ బాధితులను ఆదుకోలేదు..
తాము తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని శివాడ గ్రామానికి చెందిన తిత్లీ తుపాను బాధితులైన పలువురు రైతులు జగన్‌ను కలుసుకుని విన్నవించారు. తమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యాయం చేస్తారన్న నమ్మకం పోయిందని అగ్రిగోల్డ్‌ బాధితులు పలువురు జననేత వద్ద కష్టాలు ఏకరువుపెట్టారు.

మీరు అధికారంలోకి రాగానే ఆదుకోవాలని కోరారు. కాగా, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్న జగన్‌ పాదయాత్ర జిల్లాలో 350 కిలోమీటర్ల మేర సాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు