హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం

29 Nov, 2013 10:19 IST|Sakshi
హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం

మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన దెబ్బటి మహేశ్ మృతి మిస్టరీ వీడింది. ప్రేమ వ్యవహారమే అతడి హత్యకు దారితీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోన్ కాల్స్ ఆధారంగా మిస్టరీ ఛేదించారు. నిందితులు కాగజ్‌నగర్ మండలం అందెవెల్లి గ్రామానికి చెందిన మెకర్తి రవి(20), తాండూర్ మండలం తంగళ్లపల్లికి చెందిన మంగ రఘులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో తాండూర్ సీఐ జలగం నారాయణరావు వెల్లడించారు. మండలంలోని తుంగెడ గ్రామానికి చెందిన దెబ్బటి మహేశ్, ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు.

 

 యువతి కాగజ్‌నగర్‌లోని శ్రీలక్ష్మి నర్సింగ్‌హోంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుండగా.. ఇదే ఆస్పత్రిలోని ల్యాట్ టెక్నీషియన్ మెకర్తి రవి మధ్య పరిచయం ఏర్పడింది. రవి ఆమెను ఇష్టపడ్డాడు. మహేశ్‌ను అడ్డు తొలగించుకుంటే యువతి తనకే దక్కుతుందని భావించాడు. తన స్నేహితుడు మంగ రఘుతో కలిసి పథకం రూపొందించాడు. దీనిలో భాగంగా గత నెల 25న రవి, రఘులు మహేశ్ కోసం మోటార్‌సైకిల్‌పై మందమర్రికి వెళ్లారు. మహేశ్‌కు ఫోన్ చేయగా అప్పటికే తాను బస్సులో ఉన్నానని, ఇంటికి వెళ్తున్నాని చెప్పాడు. బెల్లంపల్లి కాల్‌టెక్స్‌లోనే దిగాలని సూచించడంతో దిగిపోయాడు. ముగ్గురు కలిసి మోటార్‌సైకిల్‌పై తాండూరుకు చేరుకుని హోటల్‌లో భోజనం చేశారు.

 

 ఆ తర్వాత కూల్‌డ్రింక్స్ తీసుకుని రెబ్బెనకు చేరుకుని గ్లోబల్ కోల్‌యార్డుకు వెళ్లే దారి పక్కన కూర్చున్నారు. కూల్‌డ్రింక్స్ సేవిస్తుండగా రఘు మహేశ్ కాళ్లుపట్టి లాగి కిందపడేయడంతో రవి అతడి ఛాతిపై కూర్చుని సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోశాడని సీఐ వివరించారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మహేశ్ మృతదేహాన్ని రైల్వేట్రాక్‌పై పడేశారని చెప్పారు. నిందితులు గోలేటి 1ఏ మీదుగా తాండూర్ వెళుతూ మధ్యలో కొత్తగూడ వద్ద స్నానం చేశారని అన్నారు. మహేశ్ తన మేనమామకు గతంలో చెప్పిన సమాచారం ఆధారంగా నిందితులపై అనుమానం కలిగిందని అన్నారు.

 

 ముందుగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 9న రెబ్బెన పోలీసుస్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారని తెలిపారు. దీంతో దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై సతీష్, ఏఎస్సై సలీమొద్దీన్, రైటర్ సారయ్య, కానిస్టేబుల్ రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు