ప్రేమాభిమానాలతోనే శాంతి సౌభాగ్యాలు

17 Oct, 2013 04:01 IST|Sakshi

కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే నగరంలో ముస్లింలు ప్రత్యేక నమాజుకు సిద్ధమయ్యారు. వన్‌టౌన్ జమ్మిచెట్టు సమీపంలోని ఈద్గాలో, జొహరాపురంలోని ఈద్గాలో ఉదయం 7:30 గంటలకే నమాజు ప్రారంభమైంది. చిన్నారులు, పెద్దలు జుబ్బా పైజామాలు, టోపీలు ధరించి వెళ్తుండటంతో వన్‌టౌన్ వీధుల్లో అత్తరు గుబాళించింది.
 
 కొన్ని మసీదులలో ఉదయం 8:15 గంటలకు బక్రీద్ నమాజు చదివి ప్రత్యేక దువా చేశారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం కుటుంబాల్లో ఖుర్బానీ కార్యక్రమం ఉండటం వల్ల ఉదయం 10 గంటల్లోపే ప్రత్యేక నమాజు పూర్తి చేసుకుని బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గాలో ఉదయం 7 గంటలకు ఈద్ ఉల్ జుహా నమాజు ప్రారంభమైంది. ఖాజీ సలీం బాషా ఇమాంగా వ్యవహరించి నమాజు చదివించారు. అనంతరం ప్రత్యేక సందేశమిస్తూ త్యాగనిరతికి బక్రీద్ పండగ సంకేతంగా నిలుస్తుందన్నారు.
 
 మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పెరిగి జగతిలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని ఆయన దువా చేశారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ హఫీజ్‌ఖాన్ పాత ఈద్గాలో నమాజులో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పాత ఈద్గా లోపల స్థలం చాలకపోవడంతో రోడ్డుపై బారులు తీరి నమాజు చేశారు. సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు బక్రీద్ నమాజు మొదలైంది. మౌలానా జుబేర్ ఇమాంగా వ్యవహరించి నమాజు చేయించారు. ఈ సందర్భంగా ఆయన సందేశమిస్తూ ప్రవక్త ఇబ్రహీం ఆదర్శంగా ప్రతి ఒక్క ముస్లిం భగవంతుని కోసం దేనినైనా త్యాగం చేసేందుకు సిద్ధపడాలన్నారు.
 
 అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలను త్యజించి అల్లా సేవలో తరించినప్పుడే మానవజన్మకు సార్థకత చేకూరుతుందన్నారు. లోక కళ్యాణం కోసం ఆయన దువా చేశారు. ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణానికి ముస్లింలందరూ తమ వంతు హార్థిక, ఆర్థిక సహకారాన్ని అందించాలన్నారు. కొత్త ఈద్గాలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాల్గొని ముస్లింలతో పాటు నమాజు చేసి బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఈద్గాలో సాధ్యమైనన్ని ఎక్కువ చెట్లు నాటించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నమాజు అనంతరం ముస్లింలు బారులు తీరి నగర రహదారుల గుండా వెళ్తుండగా హిందూ మిత్రులు వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ కరచాలనం చేస్తూ ఆత్మీయంగా పలకరించారు. పలు ముస్లిం కుటుంబాలు హిందూ మిత్రులను తమ ఇళ్లకు ఆహ్వానించి పండగ సందర్భంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఖుర్బానీ అనంతరం ముస్లిం కుటుంబాలు నిరుపేదలకు, బంధుమిత్రులకు మాంసం పంపిణీ చేశారు.
 

మరిన్ని వార్తలు