ప్రేమకథా చిత్రం

31 Jan, 2018 11:34 IST|Sakshi
అడ్డొచ్చిన వారికి దేహశుద్ది చేస్తున్న యువతి(ఎడమ), ప్రియుడితో వివాహం(కుడి)

కర్నూలు : అమ్మాయిని చూసి ఫిదా అయ్యాడు. ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే లవ్ చేయాలనుకున్నాడు. వెంటపడ్డాడు.. పరిచయం చేసుకున్నాడు. లవ్ అన్నాడు. ఛీకొట్టినా అమ్మాయితో.. ఫ్రెండ్‌షిప్‌ అన్నాడు. మరోసారి గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. యువతి ఓకే చెప్పడంతో ఛాన్స్ దొరికిందని ముగ్గులోకి దించాడు. చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. లొంగదీసుకున్నాడు. పెళ్లి మాట ఎత్తేసరికి.. ప్లేటు ఫిరాయించాడు.

కర్నూలు జిల్లా పాణ్యం మండలం రాంభూపాల్ రెడ్డి తండాకు చెందిన ఓ యువతిని, నంద్యాల మండలం కానాలకు చెందిన చంద్రశేఖర్‌ల ప్రేమ కథా చిత్రం ఇది. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఇరువురు, ఆ తరువాత కడపలో ఓ గది తీసుకుని సహజీనం సాగించారు. చంద్రశేఖర్ కొన్నాళ్లుగా మరో యువతితో చనువుగా ఉండటాన్ని చూసిన ప్రియురాలు, అతడిని నిలదీసింది. దీంతో ప్రియురాలిని వదిలించుకోవానుకున్నాడు. మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు.

చంద్రశేఖర్ తల్లిదండ్రులు.. తన ప్రియుడికి మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్దపడ్డారని తెలుసుకుంది. ప్రియుడ్ని నిలదీసింది. తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లాడుతానని చెప్పడంతో బిత్తరపోయింది. మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అనంతరం ప్రియుడి ఇంటికి వెళ్లి తమ ప్రేమ విషయాన్ని చంద్రశేఖర్‌ తల్లిదండ్రులకు చెప్పింది. అదే సమయంలో తమ అబ్బాయికి మరొకరితో, పెళ్లి చేస్తామని వారు చెప్పడంతో అపరకాళిలా మారింది. తల్లిదండ్రుల ముందే చెప్పుతో ప్రియుడికి దేహశుద్ది చేసింది. అడ్డొచ్చిన వారికి చెప్పు దెబ్బ రుచి చూపించింది.

మూడేళ్లుగా సహజీవనం సాగించి మోసం చేస్తావా? అంటూ రెచ్చిపోయింది. ప్రియురాలి చెప్పుదెబ్బకు ప్రియుడికి జ్ఞానోదయం కలిగింది. అతడి తల్లిదండ్రులతో ప్రియురాలినే పెళ్లాడతానని చెప్పడంతో చివరకు యువతితో రాజీకొచ్చారు. ఇరువురి పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. స్థానిక సుంకులమ్మ గుడిలో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో చంద్రశేఖర్ ఆ యువతి మెడలో తాళికట్టడంతో.. ప్రేమ కథ సుఖాంతమైంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా