మూడు ‘ముళ్ల’బంధం..

29 Jun, 2018 07:14 IST|Sakshi

పెటాకులవుతున్న పెళ్లిళ్లు..

అక్రమ సంబంధాలు, అవగాహనారాహిత్యంతో సంసారంలో కలహాలు

టీవీ సీరియల్, సోషల్‌ మీడియా ప్రభావంతో కూలుతున్న కుటుంబాలు

విత భాగస్వామినీహత్య చేసేందుకు వెనుకాడని వైనం

రమేష్, రాణి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు బాగానే కలిసి ఉన్నారు. ఇరువురి మధ్య వివాదాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో రమేష్‌ తాగుడికి బానిసయ్యాడు. అతడి భార్య రాణి భర్తతో కాపురం చేయడం కష్టమని తాను తనతో ఉండలేనని చెప్పి పోలీసులనుఆశ్రయించింది.

కిరణ్, లక్ష్మిలది పెద్దల కుదిర్చిన వివాహం.. ఏడాది కాపురానికి ఫలితంగా ఓ పాప కూడా ఉంది. కొన్నాళ్లకు కిరణ్, లక్ష్మిల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భార్య ఫేస్‌బుక్‌లో వేరొకరితో చాట్‌ చేస్తుందనేది కిరణ్‌ వాదన. పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. వారిద్దరూ విడిపోయిందుకు సిద్దమయ్యారు.  

రాజమహేంద్రవరం  :వీరే కాదు.. ఇలా ఎన్నె సంఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పంతాలు.. పట్టింపులు.. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం.. అక్రమసంబంధాలు.., టీవీ సీరియళ్లు.. సోషల్‌మీడియా ప్రభావం.. ఇలా ఎన్నో కారణాలతో పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. వివాహబంధం విచ్ఛిన్నమై విడాకుల వరకు వెళుతోంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు అతికొద్ది సమయంలోనే అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. అసలెందుకు ఇలా జరుగుతోంది?. వాటి కారణాలను విశ్లేషిస్తూ సాక్షి ప్రత్యేక కథనం..

వధువు అభిప్రాయానికి విలువ లేదు..
మన సమాజంలో నక్షత్ర బలం, జాతకాలు, వియ్యం అందుకునే వారు మనతో సరితూగుతారా? ఆస్తులు, పాస్తులు వంటివి ఆలోచించే తల్లిదండ్రులు అమ్మాయి ఇష్టాలను చూడకుండా కొన్ని సందర్భాల్లో వివాహాలు చేయడం వల్ల పెళ్లిళ్లు విఫలమవుతున్నాయి. విదేశాల్లో వివాహానికి ముందు వధూవరులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఇరువురి లోపాలు తెలుసుకుంటారు. మన సమాజంలో కూడా వధూవరులకు వివాహానికి ముందే కౌన్సెలింగ్‌ ఇచ్చే ఏర్పాట్లు చేయడం వల్ల కొంత వరకూ వివాహాలు నిలిచే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

అక్రమ సంబంధాలతో సంసారంలో చిచ్చు
టీవీ సీరియల్స్, సినిమాలు, వాట్సప్, ఫేస్‌ బుక్, తదితర సోషల్‌ మీడియాలు సంసారాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సీరియల్స్, సినిమాల్లో ప్రేమ, హింస, అక్రమ సంబంధాలు తదితర కథాంశాలు ప్రసారమవుతున్నాయి. భర్త డ్యూటీ నిమిత్తం ఎక్కడో పని చేసుకొని వారం పది రోజులకోసారి వచ్చే కుటుంబాల్లో, ప్రతిరోజూ ఇంటికి వచ్చే కుటుంబాల్లోనూ ఈ టీవీ సీరియళ్లు, సినిమాలు, సోషల్‌ మీడియాలో వచ్చే కథలు ఒంటిరిగా ఉండే  మహిళలపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాలకు దారి తీసి.. చివరికి భర్తనే హత్య చేసేంత స్థాయికి చేరుతున్నాయి.

సంసారాన్ని కూలదీస్తున్న సెక్షన్‌ 498ఏ కేసులు
సంసారంలో చిన్న విభేదాలు వచ్చి పోలీస్‌ స్టేషన్‌కు వెళితే వరకట్న వేధింపుల కేసులు, పెట్టి భర్త, అత్తమామలు, ఆడపడుచులపై కేసులు పెడుతున్నారు. దీని వల్ల మొత్తం కుటుంబం పోలీస్‌ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో ఇరువురి కుటుంబాల్లో ఎడబాటు పెరుగుతోంది. కొంత వరకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి సంసారాలు నిలబెడుతున్న సందర్భాలూ ఉన్నాయి. పెళ్లిళ్లు నిలబడాలంటే ముందుగా వధూవరులు అర్థం చేసుకునేలా కౌన్సెలింగ్‌ ఇవ్వడం, ముందుగానే ఇరు కుటుంబాల వారు స్థితిగతులు అర్ధం చేసుకోవడం, వంటివి చేయాలని సూచిస్తున్నారు.

మహిళా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన విడాకుల కేసులు
2016 సంవత్సరంలో 1023 కేసులు నమోదయ్యాయి. వీటిలో 926 కేసులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ఇచ్చి పోలీసులు సర్దుబాటు చేశారు. 97 కేసులలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.   
2017లో 1124 కేసులు నమోదు కాగా 1004 కేసులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 120 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
2018 మే 31 వరకూ 521 కేసులు నమోదు కాగా 381 కేసుల్లో కౌన్సెలింగ్‌ ఇచ్చి సర్దుబాటు చేశారు. 73 కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లు వేశారు.

మరిన్ని వార్తలు