మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని...

29 Jul, 2018 09:22 IST|Sakshi

రెండు రోజుల కిందట అదృశ్యమైన జంట

పురుగు మందుతాగి బలవన్మరణం 

ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం

పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో ఘటన

మృతులు యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వాసులుగా గుర్తింపు

ఒంగోలు / పెద్దారవీడు: ఎదురెదురు ఇళ్లలో నివసించే యువతీయువకుడు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారు. కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ కొండప్రాంతంలో విగతజీవులుగా కనిపిం చారు. పెద్దారవీడు మండలంలో శనివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. సేకరించిన వివరాల ప్రకారం.. యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్‌పీరా (20) సమీపంలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. వీరింటికి ఎదురుగా ఉండే డి.అరుణబీ (16) యర్రగొండపాలెం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

 ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండటంతోపాటు బంధువులు కూడా అయిన వీరిద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. హుస్సేన్, అరుణబీ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారని తెలిసిన తల్లిండ్రులు వారికి కొద్ది రోజుల కిందట కౌన్సెలింగ్‌ కూడా చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. ఈ క్రమంలో శనివారం పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు సమీపంలోగల సూర్యనారాయణమూర్తి ఆలయం సమీపంలోకి స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వనం–మనం కార్యక్రమంలో భాగంగా వెళ్లారు. కొండపైకి ఎక్కిన సమయంలో దుర్వాసన వెదజల్లడంతో పరిసరాలను పరిశీలించారు. అక్కడ కొండ చక్కల మధ్యన రెండు మృతదేహాలు ఒకదానిపై మరొకటి పడి ఉండటం చూసి ఆందోళన చెందారు.

 ఈ విషయాన్ని వెంటనే గ్రామాధికారులకు, గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న వీఆర్‌ఓ ఎస్‌.లక్ష్మయ్య, మార్కాపురం పట్టణ ఎస్‌ఐ బి.రామకోటయ్యలు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముఖాలను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాల సమీపంలో లభించిన కూల్‌డ్రింక్‌ సీసా, పురుగు మందు డబ్బాలను చూసి, ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. వీరి వద్దగల సెల్‌ఫోన్‌లోని నంబర్లకు కాల్‌చేసి మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు, బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హుస్సేన్‌ పీరా తండ్రి దస్తగిరి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు.

 అరుణ్‌బీకి ఇటీవల ఆమె కుటుంబసభ్యులు మరో యువకుడితో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే సన్నిహితంగా ఉంటున్న అరుణ్‌బీ, హుస్సేన్‌ పీరాలు ఇక్కడి కొండప్రాంతంలోని ఆలయం వద్దకు వచ్చి బలవన్మరణానికి పాల్పడి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఆలయ సమీపంలోని కొండపై యువతీయువకుల మృతదేహాలు ఉన్నట్టు తెలియడంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు