కొంప ‘కొల్లేరే’నా?

22 Sep, 2013 01:42 IST|Sakshi

కైకలూరు, న్యూస్‌లైన్ : కొద్దిపాటి వర్షానికే రాకపోకలు స్తంభించే లంకగ్రామాల ప్రజలను కొల్లేరు మరింత భయాందోలనకు గురిచేస్తోంది. విస్తార వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి బారీగా నీరు చేరుతుండడంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతోంది.దీంతో లంకగ్రామాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. కొద్ది నెలల క్రితం ఏడారిని తలపించిన కొల్లేరు ప్రస్తుతం నిండుకుండను తలపిస్తోంది. వరదల సమయంలో కొల్లేరుకు దాదాపు ఒక లక్షా 11వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది.

ప్రధానంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, చంద్రయ్య కాల్వ, పోల్‌రాజ్, శ్యాంప్ వంటి 67 డ్రైయిన్ల నుంచి ఈ నీరు వస్తుంది. ఒక్క కృష్ణాజిల్లా నుంచే 35వేల 590 క్యూసెక్కుల నీరు వివిధ డ్రైయిన్ల ద్వారా కొల్లేరుకు చేరుతుంది. ప్రస్తుతం కొల్లేరు నీటిని దిగువకు పంపించే పెదయడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం శనివారం 1.7 మీటర్లకు చేరింది. రెండు రోజుల క్రితంవరకు 1.2 మీటర్లే సూచించింది. అదే విధంగా చినయడ్లగాడి, పోల్‌రాజ్ డ్రైయిన్లలో కూడా నీటిమట్టం రానురాను పెరుగుతుంది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం కర్రల వంతెన వద్ద నీటి ఉధృతి మరింత పెరిగింది. దీంతో లోత ట్టు లంక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
 
ఇప్పటికే పెదయడ్లగాడి నుంచి పెనుమాకలంక గ్రామం చేరే రహదారి అంచునకు కొల్లేరు నీరు చేరింది. మరో రెండు రోజులు భారీగా నీరు చేరితే రోడ్డు మునిగి దిగువ గ్రామాలకు రాకపోకలు స్తంభించే ప్రమాదముంది. పై ప్రాంతాల నుంచి వస్తున్న నీటి కారణంగా పలు గ్రామాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో కొట్టేసిన చెరువుల్లోకి నీరు చేరింది.  ప్రధానంగా కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం, శృంగవరప్పాడు, చటాకాయి, కొట్డాడ, వడ్లకూటితిప్పా, మండవల్లి మండలంలో పెనుమాకలంక, నందిగామలంక, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది.

 గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క......

 ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో దట్టంగా పెరుకుపోయిన గుర్రపుడెక్క, కిక్కిస అవరోధంగా మారాయి. డ్రైయిన్ల క్రమబద్ధీకరణ జరగకపోవడం కారణంగా కొల్లేరులోకి చేరే ఒక లక్షా 11వేల క్కూసెక్కుల నీటిలో కేవలం 12వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరుతుంది. కనీసం 15 వేల క్యూసెక్కుల నీటిని పంపించే సామర్థాన్ని పెంచేందుకు రూ. 35 కోట్ల ప్రతిపాదనలను అధికారులు ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి  పంపారను. అయితే ఇప్పటికీ ఆ పనులు ప్రారంభం కాలేదు.

 అదే విధంగా కొల్లేరులోని 67 డ్రైయిన్లు అభివృద్ధి చేయడానికి (అంటే తూడు, కిక్కిస, చెత్తను తొలగించడం) రూ. 11 కోట్లతో ఆధునికీకరణ పనులకు టెండర్లు పిలిచారు. కొన్ని కారణాల వలన ఈ పనులు నిలిచాయి. ప్రస్తుతం పెదయడ్లగాడి, చినయడ్లగాడి వంతెన వద్ద పలు ఖానాల్లో గుర్రపుడెక్క, కిక్కిస పెరుకుపోయింది. అదే విధంగా కొల్లేరు నీటిని సముద్రానికి చేరవేసే ఉప్పుటేరు వంతెన వద్ద గుర్రపుడెక్క నీటి ప్రవాహానికి అడ్డువస్తుంది. అధికారులు ముందస్తు చర్యగా గుర్రపుడెక్కను తొలగించకపోతే గ్రామాలు ముంపుబారిన పడతాయని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.

 గుర్రపు డెక్క తొలగిస్తాం....

 కొల్లేరుకు నీటిని చేరవేసే పలు డ్రైయిన్లలో గుర్రపుడెక్కను నిర్మూలించడానికి ప్రణాళిను తయారు చేస్తున్నట్లు డ్రైయినేజీ జేఈ రామిరెడ్డి తెలిపారు. అత్యవసర మయిన ప్రాంతాల్లో డెక్కను తొలగిస్తామని చెప్పారు. పెదయడ్లగాడి వద్ద నీటిమట్టం 2.5 మీటర్లుకు చేరితే ప్రమాదకర మేనని అంగీకరించారు. ఎగువ నుంచి చేరుతున్న నీటి కారణంగా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు