బంగాళాఖాతంలో అల్పపీడనం

8 Jul, 2018 07:16 IST|Sakshi

రానున్న రెండు రోజులు కోస్తాంధ్రకు వర్షాలు

ఉత్తరాంధ్రలో నేడు భారీ వర్షం

సాక్షి, విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది దక్షిణ వైపునకు వంగి ఉంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి తెలిపింది.

అదే సమయంలో ఉత్తరాంధ్రలో ఆదివారం కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా గడచిన 24 గంటల్లో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో 5.58, కృష్ణాజిల్లాలోని విజయవాడ, చింతూరు, గుడివాడల్లో 5, సత్తెనపల్లి, అవనిగడ్డ, రేపల్లె, పూసపాటిరేగ, వీఆర్‌పురం, కూనవరంలో 4, అచ్చంపేట, పిడుగురాళ్ల, కుకునూరు, కొయిడ, మంగళగిరి, రెంటచింతల్లో 3, వైఎస్సార్‌ జిల్లా  రాజంపేట, కమలాపురంలో 2.4 సెం.మీ వర్షపాతం రికార్డయింది.

మరిన్ని వార్తలు