రానున్న 24 గంటల్లో అల్ప పీడనం

30 Apr, 2020 03:52 IST|Sakshi
బుధవారం విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద సముద్రాన్ని కమ్మేసిన కారుమబ్బులు

రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం 

నేడు, రేపు వర్షాలు

విశాఖ వాతావరణ కేంద్రం, ఐఎండీ

సాక్షి అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: మలక్కా జలసంధి, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

అలాగే నైరుతి మధ్యప్రదేశ్‌ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు.  కాగా, రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం కలిగింది.  

మరిన్ని వార్తలు