వణికిస్తున్న చలి గాలులు

2 Jan, 2020 05:10 IST|Sakshi

అధిక పీడన ప్రభావంతో అల్ప ఉష్ణోగ్రతలు 

ఉపరితలంపై విలోమ పొర 

రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత 

కమ్ముకుంటున్న పొగమంచు 

4 రోజుల వరకు ఇదే పరిస్థితి 

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాదిన మొదలైన చలి తీవ్రత రాష్ట్రానికీ విస్తరిస్తోంది. ఇక్కడి ప్రజల్ని గజగజా వణికిస్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా వీస్తున్న గాలుల కారణంగా ఏర్పడుతున్న శీతల ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విలోమ పొర (ఇన్వర్షన్‌ లేయర్‌) ఏర్పడి.. కాలుష్యంతో కూడిన పొగమంచు కురుస్తూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. మరోవైపు అధిక పీడన ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరో 4 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. 

కలవరపెడుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు 
నాలుగు రోజులుగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గటం.. దీనికి తోడు గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి పెరిగింది. అధిక పీడన ప్రభావంతో ఉత్తర భారతం నుంచి బలమైన గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో పాటు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల పెద్ద భేదమేమీ లేకపోయినా.. చలిగాలుల వల్ల ఈ వాతావరణం ఏర్పడిందని చెబుతున్నారు. సాధారణం కంటే 5 డిగ్రీలకు మించి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే అతి శీతల గాలులు (కోల్డ్‌ వేవ్స్‌)గా ప్రకటిస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో పలుచోట్ల కోల్డ్‌ వేవ్స్‌ కొనసాగుతున్నాయి.  కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగాల్సింది పోయి తగ్గిపోతుండటంతో చలి తీవ్రత అధికమవుతోంది. 

ఆ పొరతో ప్రమాదం 
విలోమ పొరతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ మాదిరిగా.. కింది నుంచి వెళ్లే నీటి ఆవిరి, కాలుష్యం, దుమ్ము, ధూళి కణాలన్నీ కలిసి విలోమ పొర కారణంగా మధ్యలోనే ఆగిపోయి పొగమంచులా ఏర్పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ తరహా వాతావరణం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్త  వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. 

విలోమ పొర అంటే.. 
సాధారణంగా భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ.. వాతావరణంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఉపరితలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉండగా.. పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీన్నే విలోమ పొర (ఇన్వర్షన్‌ లేయర్‌) అని పిలుస్తారు.  

మరిన్ని వార్తలు