‘గ్యాస్’ గలాట

24 Feb, 2014 03:31 IST|Sakshi
‘గ్యాస్’ గలాట
సాక్షి, ఏలూరు : వంట గ్యాస్ పంపిణీకి ఆధార్ అనుసంధానం, నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయటంతో నిన్నామొన్నటి వరకు వినియోగదారులు గగ్గోలు పెడుతూ వచ్చారు. అది ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీల డీలర్ల వంతూ అయింది. సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమకాకపోతే తమను నిలదీస్తున్నారని, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానంపై స్పష్టత లేదని  డీలర్లు ఆరోపణ. తూకంలో వచ్చే తేడాలను నివారించటానికి సీల్డ్ ప్రూఫ్ సిలిండర్లు సరఫరా చేయాలనేది వారి మరో డిమాండ్. తమ సమస్యల పరిష్కారం కోసం వారు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు.  
 
గ్యాస్ ఏజెన్సీల డీలర్లు సమ్మెతో తమకు ఇక్కట్లే అని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో  48 గ్యాస్ ఏజన్సీల కింద సుమారు 9.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల సిలిండర్లు బ్లాక్‌మార్కెటీర్ల చేతుల్లో ఉన్నాయని అంచనా. జిల్లాలో ప్రతి రోజూ గరిష్టంగా 15 వేల సిలిండర్ల వరకు ఏజెన్సీల నుంచి వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1211, వాణిజ్య అవసరాల సిలిండర్ రూ.2వేల 45 ఉంది. డీలర్లు సమ్మె చేస్తే సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందని, దీంతో బ్లాక్ మార్కెట్‌లో ధరలు చుక్కలనంటుతాయని వినియోగాదారుల భయం. ఇప్పటికీ బ్లాక్‌లో సిలిండర్‌కు రూ.300 నుంచి రూ.600 వరకు అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  
 
డీలర్ల పనితీరుపై ఆరోపణలు
గ్యాస్ ఏజెన్సీల పనితీరుపై పలు ఆరోపణలున్నాయి. ఒక్కో ఏజెన్సీకి పరిమితికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉండటం వల్ల వారు వినియోగదారులకు జవాబుదారీగా ఉండటం లేదనేది ప్రధాన ఆరోపణ. ఏ స్థాయిలో జరుగుతున్నా సిలిండర్లలో గ్యాస్ చౌర్యం సాగుతోందనే ఫిర్యాదులు ఉన్నాయి. బుక్ చేసుకుంటే నిర్ణీణ వ్యవధిలో సిలిండర్ సరఫరా చేయరని మరో ఆరోపణ.  
 
చమురు సంస్థల కొత్త విధానాలు
ఏజెన్సీలను కట్టడి చేయటానికి చమురు సంస్థలు కొత్త విధానాలను అవలంబిస్తున్నాయి. అక్రమ గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాయి. సంబంధిత చమురు సంస్థ  వెబ్‌సైట్‌కు వెళ్లి  డీలర్‌కు రేటింగ్ ఇచ్చే ఏర్పాటు చేశాయి. తక్కువ రేటింగ్ వచ్చిన డీలర్లపై విచారణ చేసి  చర్యలు తీసుకుంటున్నాయి. పరిమితికి మించి ఉన్న కనెక్షన్లను వేరే డీలర్లకు ఇవ్వాలనేది వారి విధానాల్లో ఉంది.  వినియోగదారులు తమ కనెక్షన్‌ను వేరే తమకు నచ్చిన ఏజెన్సీకి బదిలీ చేసుకునే వెసులబాటు కల్పించనున్నారు.  
 
ఆధార్‌తో సమస్యలు పెరిగాయంటున్న డీలర్లు
గ్యాస్ సిలిండర్ ధర విపరీతంగా పెంచేసి సబ్సిడీ సొమ్మును బ్యాంకులో వేస్తామని, దానికి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని ఏజెన్సీల ఆరోపణ. ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారులతోపాటు సబ్సిడీ సొమ్ము రాకపోవడంతో డీలర్లను నిలదీస్తున్నారు.  సిలిండర్ తూకం తగ్గితే డీలర్లను బాధ్యుల్ని చేసి కేసులు పెడుతున్నారు. ఈ రెండు సమస్యలతో తమకు సంబంధం లేదని, అకారణంగా తమను బలిచేస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ఆధార్‌పై స్పష్టత ఇవ్వడంతో పాటు తూనికల్లో లోపాల కేసుల నుంచి డీలర్లను తప్పించేందుకు సిలిండర్ సీలు తీసే వీలు లేకుండా సీల్డ్‌ప్రూఫ్ సిలిండర్లను బాట్లింగ్ పాయింట్ల నుంచే పంపాలని కోరుతున్నారు.  క్రమశిక్షణ పేరుతో తమపై లక్షలాది రూపాయల జరిమానా విధించటాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు