లక్కు.. కిక్కు!

29 Jun, 2014 00:42 IST|Sakshi
లక్కు.. కిక్కు!

అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలోని మద్యం దుకాణాల నిర్వాహకులను శనివారం లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో డీఆర్వో హేమసాగర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ జీవన్‌సింగ్, అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్, సూపరింటెండెంట్ ప్రణవి నేతృత్వంలో ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయించారు. మధ్యాహ్నం నాలుగు గంటలకు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత గుంతకల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దుకాణాలకు లాటరీ తీశారు. జిల్లాలో మొత్తం 236 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. 203 దుకాణాలకు 2,610 దరఖాస్తులు వచ్చాయి. 33 షాపులకు ఒక్కటీ రాలేదు.
 
 అనంతపురంలో 45 దుకాణాలకు గాను 853 దరఖాస్తులు, గుంతకల్లులో 14 దుకాణాలకు 148, తాడిపత్రిలో 21 దుకాణాలకు 82, రాయదుర్గంలో 16కు గాను 59, గుత్తిలో 20కు గాను 156, ఉరవకొండలో 7 దుకాణాలకు 103, శింగనమలలో 10కి గాను 229, కణేకల్లులో 8 దుకాణాలకు 36, ధర్మవరంలో 17కు గాను 213, హిందూపురంలో 19కు గాను 177, కదిరిలో 10 దుకాణాలకు 105, కళ్యాణదుర్గంలో 9 దుకాణాలకు 123, కంబదూరులో 3 దుకాణాలకు 39, చెన్నేకొత్తపల్లిలో 4 దుకాణాలకు 27, పెనుకొండలో 13కు గాను 75, పుట్టపర్తిలో 5 దుకాణాలకు 54, మడకశిరలో 10కి గాను 64, తనకల్లులో 5 దుకాణాలకు 67 దరఖాస్తులు వచ్చాయి. లాటరీలో పాల్గొన్న వారికి రూ.25 వేల చొప్పున ఫీజు నిర్ణయించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.6.52 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
 
 లాటరీ నిర్వహణ ఇలా...
 తొలుత దరఖాస్తుదారులకు ఆయా స్టేషన్‌ల పరిధిలో వారి ఫొటోతో కూడిన గుర్తింపు పత్రం జారీ చేశారు.  గుర్తింపు పత్రం చూపిన వారిని మాత్రమే లాటరీకి అనుమతించారు. ఒక్కో షాపునకు వచ్చిన దరఖాస్తులను వేరుచేసి లాటరీ తీశారు. ఉదాహరణకు ఒకటో నంబర్ షాపునకు 10 దరఖాస్తులు వచ్చాయనుకుంటే 1 నుంచి 10 వరకు బిళ్లలను డబ్బాలో వేసి అందులో నుంచి ఒక బిళ్లను తీశారు. దరఖాస్తు చేసినా లాటరీ ప్రక్రియకుహాజరుకాని వారిని పరిగణనలోకి తీసుకోలేదు. లాటరీ తగిలిన వారి పేరు నమోదు చేసుకున్నారు. కాగా.. మహిళలు సైతం పెద్దసంఖ్యలో లాటరీ ప్రక్రియకు హాజరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇద్దరు, ముగ్గురితో దరఖాస్తులు వేయించారు. దీంతో మహిళలు కూడా లాటరీలోపాల్గొనేందుకు వచ్చారు.
 పటిష్ట బందోబస్తు
 మద్యం దుకాణాలకు పెద్దసంఖ్యలో  దరఖాస్తులు రావడంతో లాటరీ ప్రక్రియ మధ్యాహ్నం నాలుగు  నుంచి అర్ధరాత్రి దాకా కొనసాగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా అర్ధరాత్రి దాకా వేచివున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 33 షాపుల వివరాలు వెల్లడించని అధికారులు
 జిల్లాలో 33 మద్యం షాపులకు దరఖాస్తులు రాలేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఏయే దుకాణాలకు దరఖాస్తులు రాలేదనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.
 కరెంట్ కోతతో పడరాని పాట్లు
 రాత్రి 8.30 నుంచి గంట పాటు విద్యుత్ కోత ఉండటంతో  మద్యం లాటరీకి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాటరీ నిర్వహించిన రెవెన్యూ భవన్ వద్ద ఒకట్రెండు చోట్ల మాత్రమే బల్బులు ఏర్పాటు చేశారు. మిగిలిన చాలా చోట్ల చీకట్లోనే గడిపారు. పార్కుల్లో, గోడలపై పడుకుని కొంత మంది, కబుర్లు చెప్పుకుంటూ మరికొంతమంది కాలక్షేపం చేశారు. ఇక పోలీస్, ఎక్సైజ్ అధికారులు వాహనాల లైట్ల వెలుగులో డీఏ భత్యం పంచుకోవడం కనిపించింది.
 
 కలలో కూడా ఊహించలేదు
 మేము నాలుగు బర్రెలు పెట్టుకుని పాలు అమ్ముకుంటూ బతుకుతున్నాం. దాంతో పాటు కూలి పనులకు వెళుతుంటాం. అందరిలాగే ఓ ప్రయత్నం చేద్దామని దరఖాస్తు చేశా. 126వ మద్యం షాపు దక్కింది. ఇలా దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు.
 - ఎన్.రమాదేవి, ఏడావులపర్తి,
 బీకేఎస్ మండలం,
 
 మళ్లీ అదృష్టం వరించింది
 మేము ఇది వరకే షాపు నిర్వహిస్తున్నాం. మరోసారి ప్రయత్నించాం. నాతో పాటు ఐదుగురు దరఖాస్తు చేశారు. షాపు నంబర్ 130 మాకే వచ్చింది. తిరిగి మాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాం.
 - సర స్వతి, వడియంపేట,
 అనంతపురం
 

>
మరిన్ని వార్తలు