విలాస సౌకర్యాలు జ్ఞానాన్ని పెంచలేవు: ఎ.పి.జె. అబ్దుల్ కలాం

28 Aug, 2013 01:08 IST|Sakshi
విలాస సౌకర్యాలు జ్ఞానాన్ని పెంచలేవు: ఎ.పి.జె. అబ్దుల్ కలాం

సాక్షి, హైదరాబాద్: పెద్దపెద్ద భవనాలు, విలాసవంతమైన సౌకర్యాలు జ్ఞానాన్ని పెంచలేవని, ప్రేమతో కూడిన విద్య, గొప్ప అధ్యాపకులు మాత్రమే విద్యార్థులను నాణ్యమైన పౌరులుగా తీర్చిదిద్దగలరని భారత మాజీ రాష్ట్రపతి, విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం అన్నారు. మంగళవారం గౌలిదొడ్డిలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. రామేశ్వరం పంచాయతీ పాఠశాలలో తాను చదువుకునే కాలంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఉపాధ్యాయులు తమలో జ్ఞానాన్ని నింపగలిగారని కలాం తెలిపారు. ఫలానా సబ్జెక్టును చదువుతానని విద్యార్థి అడిగితే తల్లిదండ్రులు తప్పకుండా ప్రోత్సహించాలని సూచించారు.
 
 జీవితంలో చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నేరమని, పెద్ద లక్ష్యం, నిరంతర జ్ఞాన సముపార్జన, కఠోరశ్రమ, సవాళ్లను అధిగమించడం అనే నాలుగు సూత్రాలు విజయసోపానాలని ఉద్బోధించారు. తెలుగులో ‘బాగున్నారా?’ అంటూ పలకరించి విద్యార్థులను అలరించారు. పలు పద్యాలను, విద్యార్థులు అనుసరించాల్సిన పద్ధతులను వారి చేతే చెప్పించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి సి. సిద్ధార్థన్‌రెడ్డి, గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, ఎస్సీ గురుకులాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు