ఓటేయకుండా ఎస్సీలను అడ్డుకోవడం తీవ్రమైన అంశం

18 May, 2019 03:28 IST|Sakshi

సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం 

పోలింగ్‌పై ఆరోపణలు సరికాదు ఈసీ అన్ని ఆధారాలు పరిశీలించాకే

పోలింగ్‌కు ఆదేశించింది

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి పరిధిలోని ఐదు కేంద్రాలలో రీ పోలింగ్‌కు సంబంధించి టీడీపీ నేతలు తనపై  చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. ఈసీ అన్ని ఆధారాలను సరిచూసిన తరువాతే రీ పోలింగ్‌కు ఆదేశించిందని వివరించారు. చంద్రగిరిలో పోటీ చేస్తున్న అభ్యర్ధి ఏడు గ్రామాల్లో ఎస్సీలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారని, ఎస్సీలను ఓట్లు వేయకుండా అడ్డుకోవడం తీవ్రమైన అంశమని సీఎస్‌ పేర్కొన్నారు. ఫిర్యాదులో తీవ్రత ఉన్నందునే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటం ఈసీతోపాటు అధికారుల బాధ్యతని చెప్పారు. తాను ఎన్నికల సంఘం నియమించిన సీఎస్‌నని, ఈ నేపథ్యంలో ఈసీ అప్పగించిన విధుల నిర్వహణ తన బాధ్యతని స్పష్టం చేశారు. ఫిర్యాదులపై సాక్ష్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకునేది కేంద్ర ఎన్నికల సంఘమేనని గుర్తు చేశారు. 

చూసీ చూడనట్లు వదిలేయలేం..: రీ పోలింగ్‌ విషయంలో తనను, అధికారులను తప్పుపట్టడం సరికాదని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చూసీ చూడనట్లు వదిలేయలేమని, కిందిస్థాయి అధికారులు తప్పు చేస్తే వ్యవస్థ గుడ్డిగా పాలన సాగించదని సీఎస్‌ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం సమన్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు.

టీడీపీ ఫిర్యాదులను పరిశీలించాలని సీఈవోకు సిఫారసు 
మరో ఏడు నియోజకవర్గాల్లో కూడా 18 చోట్ల రీ పోలింగ్‌ నిర్వహించేలా ఆదేశించాలంటూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సిఫారసు చేశారు. దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు