ప్రజలను అప్రమత్తం చేయండి

6 May, 2019 03:16 IST|Sakshi

భారీగా చలివేంద్రాలను ఏర్పాటు చేయండి

ప్రజలకు మంచి నీరు, చల్లని మజ్జిగ అందించండి

సేవాభావం ఉన్నవారిని ఈ దిశగా ప్రోత్సహించండి

ఎండల తీవ్రతపై కలెక్టర్లకు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వడగాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్మహ్మణ్యం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఆదివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా వాటిని ప్రోత్సహించాలని సీఎస్‌ అన్నారు. ఆస్పత్రులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో తాగునీటి వసతి కల్పించాలని సూచించారు.

ఇంకా నెలపాటు ఎండల తీవ్రత ఉండే ప్రమాదం ఉన్నందున ఎక్కడ ఎవరికి సేవలు అవసరమైనా అందించేందుకు మందులు, అంబులెన్సులతోపాటు వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అంతేకాకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అవసరమైన మేరకు అన్ని ఆస్పత్రుల్లో ఉంచాలని ఆదేశించారు. పశువుల దాహార్తిని తీర్చడానికి నీళ్లు నింపిన తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. వడగాలుల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన సూచనలపై మీడియా ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించాలన్నారు. వడదెబ్బ మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలివేంద్రాలు, బస్టాపుల్లో నీడ కోసం షెల్టర్ల ఏర్పాటు, వైద్య సేవలు అందించడం లాంటి పనులను పారిశ్రామిక సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో నిర్వహించాలని కోరారు. ఈ దిశగా ఆయా సంస్థలు ముందడుగేసేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు