డిసెంబర్‌ నాటికి పట్టణాల్లో 70 వేల గృహాలు

25 Oct, 2019 04:16 IST|Sakshi

మున్సిపల్‌ పరిపాలన, ఏపీటిడ్కో అధికారుల సమీక్షలో సీఎస్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) కింద మంజూరైన గృహాల్లో నిర్మాణంలో ఉన్న వాటిలో 70 వేల గృహాల నిర్మాణం డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మున్సిపల్‌ పరిపాలన, ఏపీటిడ్కో అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమరావతి సచివాలయంలో పీఎంఏవై పథకంపై అధికారులతో సమీక్షించారు. బ్యాంకు రుణాల కోసం నెలల తరబడి వేచి చూడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా నిధులతో తక్కువ పెట్టుబడితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

ఆ ఇళ్లకు అవసరమైన విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇంటర్నల్‌ రహదారుల నిర్మాణం, డ్రైనేజి సౌకర్యం తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామల రావు మాట్లాడుతూ.. పట్టణాల్లో పీఎంఏవై కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 7 లక్షల గృహాలను కేటాయించగా, 3.93 లక్షల గృహాల నిర్మాణం ప్రారంభమైందని, డిసెంబరులోగా 70 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ‘వైఎస్సార్‌  కంటి వెలుగు’ పథకం సంబంధిత అధికారులతో సమీక్షించారు.

తొలి విడతలో 60,693 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మున్సిపల్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాలను ఎప్పటిలోగా అమలు చేసేది స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రతి పట్టణంలో ప్లాస్టిక్‌ పొట్లాల్లో ఆహార పదార్థాలను విక్రయించే సంస్థల నుండి కొంత మొత్తాన్ని సేకరించి దానిని పర్యావరణ పరిరక్షణకు వ్యయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు