‘మా ఇంటి’కి రావా.. ‘మహాలక్ష్మి’!

25 May, 2018 12:28 IST|Sakshi

పత్తాలేని మా ఇంటి మహాలక్ష్మి పథకం

నాలుగేళ్లుగా తెరుచుకోని వెబ్‌సైట్‌

సాయం కోసం వేలాదిమంది ఎదురుచూపులు

అయోమయంలో తల్లిదండ్రులు.. పట్టించుకోని పాలకులు

సాక్షి, మచిలీపట్నం : బాలిక భవితకు బాటలు వేయాలన్న తలంపుతో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ చేసిన బంగారు తల్లి (ప్రస్తుతం ‘మా ఇంటి మహాలక్ష్మి’) పథకానికి బాలారిష్టాలు వీడటం లేదు. ప్రభుత్వాలు మారా యి.. పథకం పేరు మారింది.. కానీ బాలిక భవి ష్యత్‌ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పథకానికి మంగళం పాడే దిశగా అడుగులు పడ్డాయి. వెరసి మూడున్నరేళ్లుగా పథకంలో లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకునే వెబ్‌సైట్‌ తెరుచుకోకుండా పోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా 22 వేల మంది దరఖాస్తు చేసి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు.  బంగారు తల్లి పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో ఒక్కొక్కరికి రూ.2,500 జమ చేసిన డబ్బులు మినహా మళ్లీ నయా పైసా కూడా ఇవ్వలేదు.

పథకం ఉద్దేశం ఏంటంటే..
బాలికా శిశు మరణాలు, బాల్య వివాహాలను అరికట్టి బాలికల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బాలికా సంరక్షణ పథకం ప్రవేశపెట్టారు. ఒక ఆడపిల్లతో ఆపరేషన్‌ చేయించుకున్న పేదలకు రూ.లక్ష, ఇద్దరు ఆడ పిల్లలకు ఆపరేషన్‌ చేయించుకున్న మహిళలకు రూ.30 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన మరణాంతరం పలు ఘటనలు, మార్పులు చోటు చేసుకున్నాయి. మహానేత పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2013 మే 1 వ తేదీన బంగారు తల్లి బాలికా అభ్యుదయ సాధికారిత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఒకే తల్లికి జన్మించిన మొదటి ఇద్దరు ఆడ పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది.

అర్హులు.., అందే సాయం!
పుట్టిన పాప జనన ధ్రువీకరణ పత్రం, తల్లి ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ తదితర వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఐసీడీఎస్, ఐకేపీ ద్వారా అర్హులను ఎంపిక చేసి పాప పుట్టిన మరుక్షణమే తొలి విడతగా రూ.2,500, రెండేళ్ల రెమ్మూనరేషన్, వైద్య సేవల కోసం ఏడాదికి రూ.వెయ్యి మంజూరు చేస్తారు. పాపకు 3, 4, 5 ఏళ్ల వయసుకు రాగానే పౌష్టికాహారం నిమిత్తం ఏడాదికి రూ.1,500, విద్యాభ్యాసం నిమిత్తం ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ.2 వేలు అందజేస్తారు. విద్యాభ్యాసం నిమిత్తం 6, 7, 8 తరగతుల్లో రూ.2,500.. 9, 10 తరగతుల్లో రూ.3,000, ఇంటర్‌లో ఏడాదికి రూ.3,500, డిగ్రీలో ఏడాదికి రూ.4 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత రూ.లక్ష, ఇంటర్‌లోనే చదువు ఆపేస్తే రూ.50 వేలు చొప్పున జమ చేయాలని నిర్ణయించారు.

నాలుగేళ్లుగా ముప్పుతిప్పలు..
పథకం ప్రారంభ సమయంలో జిల్లాలో 22 వేల మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మొదటి విడత పారితోషికంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున జిల్లావ్యాప్తంగా రూ.5.50 కోట్లు మంజూరు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అనంతరం ఎన్నికలు నిర్వహించడం.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పథకం అమలు విషయమై పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పథకం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారికే సాయం అందే సూచనలు కనిపిం చడం లేదు. మూడున్నరేళ్లుగా వేలాది మంది ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వారు వెబ్‌సైట్‌ ఎప్పుడు తెరుచుకుంటుందా? తమ పిల్లల పేర్లు నమోదు చేసుకుందామా? అని ఎదురు చూస్తున్నారు.

దరఖాస్తులపై స్పష్టత కరువు..
తొలుత ఐకేపీ ఆధ్వర్యంలో పథకం అమలవుతుందని అధికారులు స్పష్టీకరించారు. అనంతరం ఐసీడీఎస్‌ ద్వారా సాయం అందుతుందని, ఆ మేరకు విధి విధానాలను సైతం రూపకల్పన చేశామని పాలకులు, అధికారులు సెలవిచ్చారు. తీరా చూస్తే నాలుగేళ్లుగా వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదు. ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని, ఐసీడీఎస్‌ అధికారులు సైతం అది తమ పథకం కాదని సమాధానమిస్తుండటంతో లబ్ధిదా రులు తమ గోడు ఎవరి వద్ద వెళ్ల బోసుకోవాలా? అని ఆందోళన చెందుతున్నారు.

విధి విధానాలురూపొందాల్సి ఉంది
పథకం ఏ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయాలి, తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి విధి విధానాలు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాది లబ్ధిదారులకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. నిధులు విడుదలైన వెంటనే అర్హులకు అందేలా చూస్తాం.  – కృష్ణకుమారి, ఐసీడీఎస్‌ పీడీ

మరిన్ని వార్తలు