మా ఇంటి మహాలక్ష్మికి మంగళం

23 Jan, 2019 14:07 IST|Sakshi

 పేరు మార్పుతో నిలిచిన వెబ్‌సైట్‌

నాలుగున్నరేళ్లుగా పథకానికి తూట్లు

చివరి బడ్జెట్‌లోనూ నిధుల కేటాయింపు నిల్‌

అయోమయంలో లబ్ధిదారులు

గుంటూరు, గురజాలరూరల్‌: బంగారు తల్లి పథకానికి కష్టాలు తప్పడం లేదు. ఆడపిల్ల పుట్టిన ప్రతి తల్లికి ఈ ప«థకం వర్తించేలా 2013 మే 1న అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెడితే... 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పథకాన్ని మా ఇంటికి రా మహాలక్ష్మిగా పేరు మార్చారు. పేరేదయితేనేం లబ్ధిదారులకు మేలు చేకూర్చితే చాలని ప్రజలు అనుకున్నారు. అయితే ఈ నాలుగేళ్లుగా ఆ పథకం ఊసే లేకుండా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పొడిచింది.

పథకం ఉద్దేశం
మహిళలపై లింగవివక్షకు వ్యతిరేకంగా బాల్య వివాహాలు, కట్నం, హింస వంటి సాంఘిక దురాచారాలు, బాలిక కుటుంబానికి భారం అనే ఒక భావన వ్యాపించింది. ఆడపిల్లలు పదవ తరగతి చదివిన తర్వాత పై చదువులు కొనసాగించేందుకు వారి తల్లిదండ్రులు సంసిద్ధులుగా లేరు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి విద్య, వివాహంలో తోడుగా ఉండేందుకు బంగారుతల్లి పథకాన్ని ప్రారంభించింది.

పథకంతో ఉపయోగాలు
బంగారుతల్లి పథకం కింద ఆడపిల్ల జననం నాటి నుంచి డిగ్రీ చదువు వరకు ప్రభుత్వం ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని అందిస్తుంది. పథకం పూర్తయ్యే దశకు రూ.2,16,000 అందించాల్పి ఉంది. ççఈ పథకం రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డులందరికీ వర్తిస్తుంది.

పేరు మార్పుతో సరి
ప్రభుత్వం మాత్రం పథకానికి  మా ఇంటి మహాలక్ష్మిగా పేరు మార్చింది. చంద్రబాబు మహాలక్ష్మికే మంగళం పాడేశారు. జిల్లాలో 19,140 మంది లబ్ధిదారులను రిజిస్టర్‌ చేయగా 19,140 మంది పథకానికి ఎంపికయ్యారు. వీరిలో 8,234 మందికి  మొదటి విడతగా రూ.2,05,85,000 నగదు లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమైంది. గురజాల మండలంలో 418మంది రిజిస్టర్‌ చేసుకోగా  వీరిలో176 మందికి రూ.4,40,000 వారి ఖాతాల్లో జమైంది. పథకం ప్రారంభంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యతగా, ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు రెండో ప్రాధాన్యతగా కల్పించారు.

చివరి బడ్జెట్‌లో కూడా మొండిచేయే!
బంగారుతల్లి పథకానికి పేరుమార్చిన టీడీపీ సర్కార్‌ చివరి బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించక పోగా, ఆ పథకాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో, ఆయా శాఖలకు కూడా అంతుచిక్కడంలేదు. మా ఇంటి మహాలక్ష్మిగా నామకరణ చేసిన తర్వాత 2015 జనవరి 1వతేదీ నుంచి బంగారుతల్లి వెబ్‌సైట్‌ను నిలిపివేశారు. దీంతో ఆ పథకానికి అర్హులైన వారికి సమాచారం అందే అవకాశం లేకుండా పోయింది. గతంలో పనిచేసిన ఐకేపీ వారి వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో అర్హులకు తగిన సమాచారం ఇచ్చేవారు లేరు.పుట్టిన బంగారుతల్లులు పెద్ద అయి పెరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం వారిని చిన్నచూపు చూస్తోందని తల్లులు ఆరోపిస్తున్నారు.

ఒక్కసారి పంపిణీతో సరి
ఒక్కసారి మాత్రమే తల్లుల బ్యాంక్‌ అకౌంట్లలో ఒక విడత రూ.2500 జమ చేశారు. అయితే రెండో విడతగా వేయాల్సిన మొత్తాలను ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. సంబంధిత అధికారులు స్పందించి పథకం వివరాలు తెలియజేయాలని, ఆడబిడ్డల కోసం పెట్టిన పథకం నిర్వీర్యం కాకుండా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పథకం వివరాలు చెప్పేవారే కరువయ్యారు
గతంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఉన్న ఈ పథకం ఐసీడీఎస్‌ వారికి అప్పచెప్పినట్లు ఐకేపీ అధికారులు చెబుతున్నారు. ఐసీడీఎస్‌ వారిని సంప్రదిస్తే  పత్రికల్లో మాత్రమే చూశామని,  తమకు మాత్రం ఎటువంటి పథకాలు అప్పచెప్పలేదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు అసలు ఈ పథకం ఉందా..లేదా అనే మీమాంసలో ఉన్నారు.

బంగారు తల్లి పథకం ఉందా.. లేదా..!
2014లో పాప పుట్టింది, బంగారు తల్లి పథకానికి అర్జీ చేసుకున్నాం. పథకానికి అర్హత సాధిం చాము. ఆ తర్వాత ఆ పథకం గురించి చెప్పేవారే కరువయ్యారు. అటు వెలుగువారిని, ఇటు మహిళా శిశు సంక్షేమ కార్యాలయాన్ని సంప్రదించినా తెలియదంటున్నారు. అసలు పథకం ఉందో...లేదో కూడా అర్థం కావడంలేదు.  – సరికొండ  లత, అంబాపురం

మాకు ఎలాంటి సమాచారం లేదు
బంగారుతల్లి పథకాన్ని నిర్వహించమని ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక పత్రాలు రాలేదు, మా దగ్గర  సమాచారం కూడా లేదు.– మేరీభారతి, మహిళా శిశుసంక్షేమ శాఖ ఏపీడీ

ఆర్థ్ధిక ఇబ్బందులతో చదువు కష్టంగా మారుతోంది
అమ్మానాన్నలకు మేము ఇద్దరం ఆడపిల్లలం. బంగారు తల్లి పథకంతో పై చదువులు చదివించవచ్చని అమ్మానాన్నా ఆశ పడ్డారు. ఇంతవరకు బ్యాంక్‌ఖాతాలో నిధులు జమకాలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వలన చదువులు కొనసాగించే పరిస్థితి లేదు. పథకాన్ని పునరుద్ధరించి మాలాంటి నిరుపేద ఆడపిల్లలు చదువుకునేందుకు సహాయపడాలి.            – జి.అనూషలక్ష్మి, 10వ తరగతి విద్యార్థిని

మరిన్ని వార్తలు