ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ! 

21 Oct, 2019 11:31 IST|Sakshi
మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌

రూ.280 కోట్లతో విస్తరణకు ప్రతిపాదనలు 

మచిలీపట్నం పరిధిలోని గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ పట్టనుంది. గడచిన కొన్నేళ్లుగా అలంకారప్రాయంగా మారిన హార్బర్‌ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. హార్బర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు చేస్తోంది. దీనికి రూ. 280 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ ప్రతిపాదనలు అమలైతే జిల్లాలోని మత్స్యకారులకు మేలు జరగడంతోపాటు పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది.
 
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని ఏకైక ఫిషింగ్‌ హార్బర్‌ బందరు సమీపంలోని గిలకలదిండి వద్ద ఉంది. దీనిని దాదాపు పాతికేళ్ల క్రితం రూ.4.70 కోట్లు వెచ్చించి నిర్మించారు. ఇక్కడ ప్రస్తుతం ఇసుక మేటలు వేసి పూడుకుపోవడంతో బోట్లు సముద్రంలోకి వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో చాలా ఏళ్లుగా ఈ హార్బర్‌ మత్స్యకారులకు అక్కరకు రావడం లేదు. కొన్నేళ్లపాటు పోటు సమయంలో మాత్రమే అతికష్టం మీద వేటకెళ్లేవారు. ఆ తర్వాత అదీ వీలు పడలేదు. విధిలేని పరిస్థితుల్లో జిల్లా మత్స్యకారులు ఇతర జిల్లాల్లో ఉన్నహార్బర్లకు వెళ్లి అక్కడ నుంచి చేపలవేట సాగిస్తున్నారు. మత్స్యకారులు ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వాలు గిలకలదిండి హార్బర్‌ సమస్యను తేలిగ్గా తీసుకున్నాయి. ఈ హార్బర్‌ విస్తరణకు తూతూమంత్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడానికే పరిమితమయ్యాయి. 

ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో..
ఇలా ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న ఈ హార్బర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకురావడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హార్బర్‌ పునర్‌ నిర్మాణంపై డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతను వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (వాప్‌కోస్‌)కు అప్పగించింది. ఈ సంస్థ నివేదికను రూపొందించి హార్బర్‌ పునర్‌ నిర్మాణానికి రూ.280 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసింది.  

ఆధునిక సదుపాయాలు..
ఈ ప్రతిపాదనలు అమలైతే హార్బర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలు, మౌలిక వసతులు ఏర్పాటవుతాయి. వీటిలో చేపల అమ్మకం షెడ్లు, లోడింగ్‌ సదుపాయాలు, పరిపాలనా భవనం, కమర్షియల్‌ కాంప్లెక్స్, రెస్టారెంట్, మత్స్యకారుల విశ్రాంతి భవనం, వర్తకులకు డార్మిటరీ, మరుగుదొడ్లు, సామాజిక భవనం, కోస్టల్‌ పోలీస్‌ స్టేషన్, రేడియో కమ్యూనికేషన్‌ టవర్, అంతర్గత రోడ్లు, పార్కింగ్‌ బోటు బిల్డింగ్, రిపేరు, టింబర్‌ యార్డులు, ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్, రక్షిత మంచినీటి ట్యాంకు, ఐస్‌ ప్లాంట్లు, ఇంధన స్టోరేజి సదుపాయాలు వంటివి ఉంటాయి. హార్బర్‌లో రోజుకు 1.75 లక్షల నీరు అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం రెండు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేయనున్నారు. 

ఇసుక సమస్యకు పరిష్కారం ఇలా..
హార్బరు పరిసరాల్లో ఇసుక పెద్ద ఎత్తున పేరుకుపోతుండడం బోట్ల రాకపోకలకు వీలుపడడం లేదు. అందువల్ల హార్బర్‌ బేసిన్‌లో 3.5 మీటర్ల లోతు వరకు ఇసుకను డ్రెడ్జింగ్‌ చేస్తారు. పడవలు సముద్రంలోకి వెళ్లడానికి, ఇసుక మేటలు నివారించడానికి 1150 మీటర్ల దూరం ఒకటి, 1240 మీటర్ల మేర మరొకటి చొప్పున ట్రైనింగ్‌ వాల్స్‌ (గోడలు) నిర్మిస్తారు. ప్రస్తుతం 200 మీటర్ల గోడ మాత్రమే ఉంది. అలాగే బోట్లు, క్రాఫ్ట్‌లు, వెస్సల్స్‌ ల్యాండింగ్‌కు వీలుగా 798 మీటర్ల మేర గట్టు (క్వే) నిర్మాణం కూడా చేపడతారు. 

10 ఎకరాల స్థలం అవసరం..
హార్బర్‌ విస్తరణకు అవసరమైన పర్యావరణ, ఎస్‌ఈజెడ్‌ అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. ప్రస్తుతం ఉన్న గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి 350 బోట్ల రాకపోకలకు వీలుగా నిర్మించారు. విస్తరణ అనంతరం హార్బర్‌ అందుబాటులోకి వస్తే 1,600 బోట్లు రాకపోకలు సాగించేందుకు వీలుంటుంది. హార్బర్‌ విస్తరణకు 10 ఎకరాల స్థలం అవసరమవుతుంది. ఇది మచిలీపట్నం పోర్టు ఆధీనంలో ఉంది. ఈ స్థలాన్ని హార్బర్‌కు కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయితే త్వరలోనే టెండర్లు పిలుస్తారని మత్స్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. విస్తరణ పూర్తయితే ఈ హార్బర్‌లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగాను ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని వార్తలు