మడకశిరలో విషాదం 

16 Oct, 2019 08:11 IST|Sakshi
కుమారుడు కిషోర్‌తో మృతులు మేడా శ్రీనివాసులు, మేడా మధురాక్షమ్మ(ఫైల్‌)  

సాక్షి, మడకశిర(అనంతపురం) : తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం బస్సు లోయలో పడిన ప్రమాదంలో మడకశిరకు చెందిన ఇద్దరు మృతి చెందారు. పట్టణానికి చెందిన మేడా శ్రీనివాసులు(62), మేడా మధురాక్షమ్మ(56) ఈ ప్రమాదంలో మరణించారు. వీరు శుక్రవారం రాత్రి మడకశిర నుంచి ఓ  ప్రైవేట్‌ మినీ బస్సులో అన్నవరం, భద్రాచలం తదితర ప్రాంతాల సందర్శనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా చెళ్ళకెరకు వెళ్లారు. చెళ్ళకెరలోని బంధువులను కూడా ఆయా ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం భద్రాచలంలో పూజలు నిర్వహించుకున్నారు. ఆ తర్వాత అన్నవరానికి  వెళ్తుండగా మారేడుమిల్లి–చింతూరు మధ్య వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడగా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో మడకశిరకు చెందిన మేడా శ్రీనివాసులు, మేడా మధురాక్షమ్మ ఉన్నారు. ఈ దంపతులకు కుమారుడు కిశోర్, కుమార్తెలు ఆశ, నాగమణి సంతానం. కుమార్తెలిద్దరికీ వివాహం కాగా.. కుమారుడు కిశోర్‌ ఓ ప్రైవేట్‌ టెలికాం సంస్థలో పని చేస్తున్నాడు. మృతులు మడకశిరలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుమారుడు తన మిత్రులతో కలిసి ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. 

మృతుల్లో కొందరి మూలాలు మడకశిరలోనే.
మృతుల్లో ఎక్కువమందికి మడకశిరతో సంబంధం ఉంది. ప్రస్తుతం చెళ్ళకెరలో నివాసం ఉంటున్న మేడా వెంకటాచలపతి(56), మేడా గాయత్రమ్మ(52), వీరి కుమార్తె మేడా శ్వేత(25) కూడా మృతుల్లో ఉన్నారు. వీరు మడకశిర నియోజకవర్గంలోని అగళి మండలం ఇనగలూరుకు చెందిన వారు. ఈ కుటుంబం 25 ఏళ్ల పాటు ఇదే మండలంలోని దొక్కలపల్లిలో చిల్లర అంగడిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహించారు. ఐదేళ్ల క్రితమే ఈ కుటుంబం అంతా చెళ్ళకెరకు వలస వెళ్లింది. ప్రమాదంలో ఈ కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడం బంధువులను విషాదంలోకి నెట్టింది.   


 

మరిన్ని వార్తలు