మళ్లీ రావయ్యా! మల్లికార్జునయ్యా..

3 Dec, 2015 11:32 IST|Sakshi
మళ్లీ రావయ్యా! మల్లికార్జునయ్యా..
మదనపల్లె: ఇక్కడ ఫొటోలో తలకు క్యాప్ పెట్టుకుని, నీలిరంగు చొక్కాను టక్ చేసుకుని, సీరియస్‌గా నీళ్లకు బండరాళ్లను అడ్డం వేస్తున్న వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది?.. చూడటానికి చదువుకున్నోడిలా ఉన్నాడనో, మరెవరో అనుకుంటున్నారు కదూ! నిజానికి ఆయన మదనపల్లె సబ్ కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున. వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం ఆయనది. బదిలీ అయినప్పటికీ విధులను నిబద్ధతతో నిర్వర్తించి, తా నూ రైతు బిడ్డనే అని పరోక్షంగా చాటారు.
 
భారీ వర్షాలకు మండలంలోని పలు చెరువులు ప్రమాదస్థితికి చేరాయి. బుధవారం వీటిని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో కలసి సబ్‌కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని పెద్ద మొరవ అధ్వానంగా ఉండడడంతో నీరు వృథాగా పోతోంది. ఇది చూసి సబ్‌కలెక్టర్ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం స్పందించారు. నీరు వృథా కాకుండా చర్యలకు ఉపక్రమించారు. ఫ్యాంటును పాదంపై వరకూ మడిచారు. అక్కడ ఉన్న బండరాళ్లను తానే స్వయంగా మోసుకొచ్చి, నీటికి అడ్డుకట్టగా వేయసాగారు. ఇది చూసి తక్కిన ఆయనతో వచ్చిన ఇతర సిబ్బంది తామూ ఓ చెయ్యి వేశారు. వాళ్లు రాళ్లు అందిస్తూంటే దెబ్బతిన్న మొరవ కట్టపై వరుసగా పేర్చి, నీటిని నిలువరించసాగారు.
విషయం తెలుసుకున్న ఆయకట్టు రైతులు అక్క డి చేరుకుని ఆయన శ్రమలో పాలు పంచుకునేందుకు ఉద్యుక్తులయ్యారు. వారిపై కూడా సబ్ కలెక్టర్ మండిపడ్డారు. ‘ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పలేదు సరే..రైతులుగా ఉండి మీరేం చేస్తున్నారు?.. మొరవ పరిస్థితి ఇలా ఉంటే మా దృష్టికి తీసుకురావాలనే ఆలోచన కూడా లేదా?’ అంటూ చీవాట్లు పెట్టడంలో రైతులు నోరెళ్ల బెట్టారు.! ఇప్పటివరకూ ఇలాంటి అధికారిని తాము చూడలేదని, సబ్ కలెక్టర్ బదిలీ అయినా రైతు సంక్షేమమే ముఖ్యం అన్నట్లుగా ఆయన మాట్లాడారని ఆయకట్టుదారులతో పాటు ఎమ్మెల్యే కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. 
మరిన్ని వార్తలు