క్వారంటైన్‌: చిన్నబిడ్డ తల్లిపై అంత నిర్లక్ష్యమా..?

26 Apr, 2020 09:07 IST|Sakshi
బి.కొత్తకోట తహసీల్దారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సబ్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి 

బి.కొత్తకోట తహసీల్దార్‌పై 

సబ్‌ కలెక్టర్‌ ఆగ్రహం 

సాక్షి, కురబలకోట: మూడు నెలల పసిబిడ్డతో వచ్చిన మహిళ పట్ల బి.కొత్తకోట ఇన్‌చార్జి తహసీల్దార్‌ హరికుమార్‌ వ్యవహరించిన తీరుపై మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం అంగళ్లులోని క్వారంటైన్‌ సెంటర్‌ను పరిశీలించారు. సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె బి.కొత్తకోట తహసీల్దార్‌పై మండిపడ్డారు. రెండు రోజుల క్రితం బి.కొత్తకోటకు వచ్చిన ఓ సీనియర్‌ తహసీల్దార్‌ కోడలు మౌనికను అధికారులు కరోనా వైరస్‌ పరీక్ష కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేయకుండానే ఆమెను కురబలకోట మండలంలోని అంగళ్లు క్వారంటైన్‌కు తరలించారు. ముందస్తు సంసిద్ధత లేకుండా మూడు నెలల పసికందుతో క్వారంటైన్‌కు తరలించడంపై ఆమె తీవ్ర కలత చెందారు.

ఆమె మామ జిల్లాలోనే సీనియర్‌ తహసీల్దారు. ఆమె బెంగళూరులో ఓ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు లేవని క్వారంటైన్‌ అధికారులు గుర్తించారు. అయినా ఆమె అనుమతి కానీ, ముందస్తు సమాచారం లేకుండా క్వారంటైన్‌కు ఎలా పంపుతారని సబ్‌ కలెక్టర్‌ తహసీల్దార్‌ను ప్రశ్నించారు. హోం క్వారంటైన్‌లో ఉండేలా చూడాలని, లేదంటే మెడికల్‌ ఆఫీసర్‌తో సంప్రదించి ఆ తర్వాత నియోజక వర్గ వైద్యాధికారితో మాట్లాడి క్వారంటైన్‌కు తరలించాలని, ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల టీమ్‌గా వ్యవహరించాల్సిన బి.కొత్తకోట ఎంపీడీఓ సుధాకర్, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌పై కూడా ఆమె మండిపడ్డారు. 

భౌతిక దూరం పాటించాలి
మదనపల్లె టౌన్‌ : టమాట మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులు, లారీల డ్రైవర్లు భౌతిక దూరం పాటించాలని సబ్‌కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె శనివారం టమాట మార్కెట్‌ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే కొనుగోలు దారులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే క్రయ విక్రయాలు జరపాలన్నారు.

మరిన్ని వార్తలు