ఎన్నికల విధుల నుంచి మదనపల్లె సీఐ తొలగింపు

7 Apr, 2019 11:47 IST|Sakshi

సాక్షి, మదనపల్లె : నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై ఎన్నికల కమిషన్‌ వేటు వేసింది. మదనపల్లె టూ టౌన్‌ సీఐ సురేష్‌ కుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 2వ తేదీన మదనపల్లెలో సీఎం పర్యటన సందర్భంగా స్థానిక నిమ్మనపల్లె మార్గం లో ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు ఆహార పొట్లాలు ప్యాక్‌చేసి అందజేస్తున్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది.

ఈ విషయాన్ని రాజంపేట పార్లమెంట్‌ అబ్జర్వర్‌ నవీన్‌కుమార్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు సమాచారాన్ని చేరవేశారు. ఆర్‌ఐ పల్లవి సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం వాస్తవమని ధ్రువీకరించి కేసు నమోదుకు సీఐ సురేష్‌ కుమార్‌కు సిఫారసు చేశారు. కేసు నమోదులో సీఐ అలసత్వం కనబరిచినందుకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు. సురేష్‌ స్థానంలో అనంతపురం డీటీసీలో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సుబ్బరాయుడును నియమించారు.  

మరిన్ని వార్తలు