‘మధురవాడ’ మరింత ప్రియం!

31 Jan, 2019 07:56 IST|Sakshi
మధురవాడ వ్యూ

రూ.లక్షకు చేరువలో గజం ధర

మరింతగా ఎగబాకిన ప్లాట్ల రేట్లు

వీఎంఆర్‌డీఏ వేలంలో వెలుగులోకి..

సాక్షి, విశాఖపట్నం: ఇన్నాళ్లూ విశాఖ నడిబొడ్డున ఉన్న స్థలాలకే ఎంతో డిమాండ్‌ ఉందనుకున్న వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురవాడ ఇప్పుడు నగరంలో ప్లాట్ల ధరలను తలదన్నే స్థాయికి చేరింది. ఇప్పుడక్కడ గజం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరడమే దీనికి నిదర్శనం. ఇటు నగర వాసులతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను ఆశ్చర్య చకితులను చేసేలా అక్కడ ధరలు ఎగబాకాయి. విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్వహించిన వేలంపాటల్లో నగరంలోని ఎంవీపీ లేఅవుట్‌ ఎల్‌ఐజీ 113లోని 387.27 చదరపు గజాల స్థలానికి రికార్డు స్థాయిలో గజం ధర రూ.1,08,700 పలికిన సంగతి తెలిసిందే.

అయితే నగరానికి దూరంగా ఉన్న మధురవాడలో గజం ధర గరిష్టంగా రూ.95,960 పలికింది. అక్కడ 142.37 గజాల ఆడ్‌బిట్‌ను రూ.1,36,61,825కు తాటితూరు రవి, రమేష్‌లు దక్కించుకున్నారు. ఇంకా అక్కడ స్థలాలకు గజం రూ.95,160లకు, 94,660ల వరకు ఎగబాకింది. ఎంవీపీ లేఅవుట్‌లోనే ఆడ్‌బిట్‌లు రూ.56,600లు, 66,200లే ధర పలికాయి. అంటే ఎంవీపీ లేఅవుట్‌కంటే మధురవాడ జాగాలే అధిక ధరలు పలికాయన్నమాట! ఇక రుషికొండ లేఅవుట్‌లోని స్థలాలు రూ.22,300 నుంచి 25,300ల మధ్య ఖరారయ్యాయి. అలాగే చినముషిడివాడ లేఅవుట్‌లో గజం రూ.29,200 వరకు వెళ్లింది. లేఅవుట్‌లలో 25 స్థలాలకు నిర్వహించిన వేలం పాటల ద్వారా వీఎంఆర్‌డీఏకు రూ.86,18,90,759 ఆదాయం సమకూరనుంది.

మరిన్ని వార్తలు